
- అధికారులకు టీజీఎస్పీడీసీఎల్సీ ఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఇకపై గ్రేటర్ హైదరాబాద్‌లో 'పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్' అనే కొత్త టెక్నాలజీని అమలు చేయాలని అధికారులను సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు.అంబర్‌పేట్ పోలీస్ లైన్‌లో ఏర్పాటు చేసిన నమూనా పోల్ మౌంటెడ్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన బుధవారం పరిశీలించారు. భవిష్యత్తులో అన్ని కొత్త ట్రాన్స్‌ఫార్మర్లకు ఈ పద్ధతినే అనుసరించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రభుత్వ సూచనల మేరకు, నగరంలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో వినూత్న మార్పులు చేయాలని సదరన్ డిస్కం నిర్ణయించింది. ప్రస్తుతం రోడ్ల పక్కన నేలపై దిమ్మెలను కట్టి వాటిపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పాదచారులకు అసౌకర్యం కలగడంతో పాటు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. షార్ట్ సర్క్యూట్, విద్యుత్ లీకేజీల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు సదరన్ డిస్కం 'పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్' అనే నూతన టెక్నాలజీని అమలు చేయనుంది. ఈ పద్ధతిలో 10 అడుగుల ఎత్తులో ఐరన్ స్ట్రక్చర్‌పై ట్రాన్స్‌ఫార్మర్‌ను అమరుస్తారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ భూమికి దూరంగా ఉండి, పాదచారుల రాకపోకలకు ఆటంకం కలగదు. చెత్త, వ్యర్థాలు చేరకుండా భద్రత మెరుగవుతుంది. అంతేకాక, ఈ విధానం ట్రాన్స్‌ఫార్మర్ స్ట్రక్చర్ ఖర్చును కూడా తగ్గిస్తుందని అధికారులు పేర్కొన్నారు.