ఏపీ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదకరం

ఏపీ పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదకరం
  • జగన్‎కు అధికారంలో ఉంటేనే రాజ్యాంగం గుర్తు వస్తుందా..?
  • వైఎస్ జగన్ వ్యాఖ్యలు నేరస్తులను ప్రోత్సహిస్తున్నాయి
  • టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిణామాలు ప్రజాస్వామ్యనికి, రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదకరంగా మారాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో నేరాలు, నేర ప్రవృత్తి పెరిగిందని, నేరాలు, నేరస్తులు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నేరస్తులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్నారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం ఉన్న సంస్కృతి రాజశేఖర్ రెడ్డి, జగన్ కుటుంబం నుంచి వచ్చిందేనన్నారు.

చంద్రబాబును తిట్టేటప్పుడు రాజ్యాంగం గుర్తురాలేదా..?

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు  రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న చంద్రబాబును తిట్టేపుడు ప్రస్తుత ఆవేదన గుర్తురాలేదా ? అని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. జగన్ చంద్రబాబు పై చేసిన తిట్ల పురాణాన్ని కనకమేడల రవీంద్ర కుమార్ చదివి వినిపించారు. ‘‘గతంలో చంద్రబాబును చెప్పుతో కొట్టాలి, నడి రోడ్డుపై కాల్చి చంపాలి అని వ్యాఖ్యలు చేశారు.. జగన్ అధికారంలో ఉంటేనే రాజ్యాంగం గుర్తు వస్తుందా..? జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు చేసిన వ్యాఖ్యల పట్ల ముందు జగన్ ప్రజలకి క్షమాపణలు చెప్పాలి.. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తున్నారా..? మనోభావాలు దెబ్బతిని దాడులకు పాల్పడ్డారు.. ఇదేవిధానంగా దాడులు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.. ఇలాంటి దాడులే జరుగుతాయని ముఖ్యమంత్రి ప్రజలను, రౌడీ మూకలను రెచ్చ గొడుతున్నారు.. హింసను ప్రేరేపిస్తున్నారు..’’ అని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. బూతులు తిడుతున్న వైసిపి నేతలు, మంత్రులపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి , మంత్రులు, ఎమ్మెల్యేలు నోటిని అదుపులో పెట్టుకుని పోలీసులు వారి పని వారు చేస్తే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయా ? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు టిడిపి కార్యాలయంలో దాడులపై పోలీసులు  వివరాలు నమోదు చేయలేదు, ఒక్క వైసిపి నేతను కార్యకర్తను అరెస్ట్ చేయలేదు అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు.