ఫిఫా వరల్డ్ కప్ ఫేవరేట్ టీమ్స్ లలో పోర్చుగల్ కూడా ఒకటి కదా. క్రిస్టియానో రొనాల్డో లాంటి టాప్ ప్లేయర్ ఉన్న ఆ జట్టుపై.. ప్రపంచ కప్ లో తొలి గోల్ కొట్టి డీఆర్ కాంగో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆ గోల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఓవర్ నైట్ లో ఆ ప్లేయర్ హీరో అయిపోయాడు. అతడే యోవానే విస్సా.. ఐదేళ్ల క్రితం చూపు కోల్పోయి.. కెరీర్ ఎండ్ అనుకునే దశ నుంచి టీమ్ కే ఆశాదీపంగా మారే వరకు అతడి ఇన్ స్పైరింగ్ జర్నీ ఇది.
హ్యూస్టన్‌లో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో, టోర్నమెంట్ ఫేవరెట్లలో ఒకటైన పోర్చుగల్‌పై, యోవానే విస్సా కొట్టిన హెడర్ గోల్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది. 52 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DR కాంగో) కు ప్రపంచ కప్‌లో మొట్టమొదటి గోల్ చేసి చరిత్ర సృష్టించాడు విస్సా . బుధవారం (జూన్ 17) జరిగిన మ్యాచ్‌లో, సెకండ్ హాఫ్ లో ఐదు నిమిషాలకే దొరికిన కార్నర్ కిక్‌ను 29 ఏళ్ల న్యూకాజిల్ యునైటెడ్ ఫార్వర్డ్ టీమ్ తరఫున అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. 52 ఏళ్ల తర్వాత డీఆర్ కాంగో ప్రపంచ కప్‌లోకి తిరిగి వచ్చిన సందర్భంగా తొలి గోల్ కొట్టి చరిత్ర సృష్టించాడు.
మ్యాచ్ స్టార్టైన ఆరవ నిమిషంలో పోర్చుగల్ ప్లేయర్ జోవా నెవ్స్ గోల్ చేయడంతో హ్యూస్టన్ స్టేడియం హోరెత్తింది. బేసికల్ గా పోర్చుగల్ కు ఫ్యాన్స్ ఎక్కువ. దీంతో స్టేడియంను ఎర్రటి సముద్రంగా మారిపోగా.. పోర్చుగల్ తొలి గోల్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్ సందడికి అంతులేకుండా పోయింది. అలాంటి సందర్భంలో యోవానే విస్సా కొట్టిన గోల్ తో స్టేడియం అంతా సైలైంట్ అయిపోయిన పరిస్థితి.
ఆఫ్రికాలో ఫేమస్ ఆటగాళ్లలో ఒకరైన విస్సా సాధించిన ఈ హిస్టారికల్ మూమెంట్ ను.. పోర్చుగీస్, కాంగో అభిమానులు ఆస్వాదిస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో వరల్డ్ వైడ్ గా విస్సా గోల్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది.
- ఐదేళ్ల కింద ఊహించని ఘటన..
ఐదు సంవత్సరాల క్రితం, విస్సాపై ఊహించని యాసిడ్ దాడి జరిగింది. అత్యంత గాఢత కలిగిన కెమికల్స్ కారణంగా దాదాపు కంటిచూపు కోల్పోయాడు. ఆ తర్వాత సర్జరీతో నార్మల్ అయినా.. మళ్లీ కెరీర్ ప్రారంభిస్తాడని.. వరల్డ్ కప్ లో ఒవర్ నైట్ స్టార్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు.
జూలై 1, 2021న, విస్సా కుమార్తెను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన మహిళ.. విస్సా డోర్ తెరవగానే మొహంపై యాసిడ్ పోసింది. ఆ దాడి నుండి కోలుకోవడానికి విస్సాకు ఆరు నెలలు పట్టింది. ఆ ఘటన అతడిని తీవ్రంగా కుదిపేసింది. అయితే ఆటపై ఉన్న ఆసక్తి.. ఆడాలనే సంకల్పం అతడిని మళ్లీ ఫుట్ బాల్ పట్టుకునేలా చేసింది. ఫ్రాన్స్‌లోని ఎఫ్‌సి లోరియంట్ తరపున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడుతూ తన కెరీర్ ముందుకు సాగాంచాలని నిర్ణయించుకున్నాడు.
దాడి జరిగిన తర్వాత నా జీవితం ఇలా అయిపోయిందనే కంప్లైంట్ లేకుండా ముందుకు సాగాడు అని సన్నిహితులు చెప్పారు. ఏది ఏమైనా ముందుకు సాగాలని కోరుకున్నాడు, ఈ రోజు విస్సా సాధించిన గోల్.. అతని సంకల్పానికి, పట్టుదలకు లభించిన ప్రతిఫలం అని చెబుతున్నారు. యోవానే విస్సా ఒకసారి ఒక ఆలోచన మనసులో పెట్టుకుంటే, దానికి ఎంత సమయం పట్టినా సరే, దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తాడని తెలిపారు.
హ్యూస్టన్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో కాంగో, పోర్చుగల్‌ను 1-1తో అడ్డుకోవడంతో, విస్సా తమ దేశానికి దొరికిన అదృష్టంగా చెప్పుకుంటున్నారు.
