భారీగా పెరిగిన బిట్‌కాయిన్‌ విలువ..ఒక్కరోజులోనే 6.3 శాతం పెరుగుదల

  భారీగా పెరిగిన బిట్‌కాయిన్‌ విలువ..ఒక్కరోజులోనే 6.3 శాతం పెరుగుదల

క్రిప్టోకరెన్సీ  బిట్‌కాయిన్‌ విలువ భారీగా పెరిగింది. గత కొన్ని రోజుల పాటు 20 వేల డాలర్లలోపు ట్రేడ్ అయిన బిట్ కాయిన్‌..  తాజాగా ఒక్కరోజులోనే 6.3 శాతం పెరిగి 30 వేల డాలర్ల మార్కును దాటడం విశేషం. 2022 జూన్‌ తర్వాత  బిట్‌కాయిన్‌ 30 వేల డాలర్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. 

అమెరికాలో  బ్యాంకుల దివాలా, అధిక వడ్డీరేట్లకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చరమగీతం పాడే అవకాశం ఉండడంతో  బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  దీంతో  వారం రోజులుగా బిట్‌కాయిన్‌  కొనుగోళ్లలో దూసుకుపోతుంది. ఏప్రిల్ 11వ తేదీ బిట్ కాయిన్ మరో 6.3 శాతం పెరిగింది. దీంతో బిట్‌కాయిన్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతం 583.4 బిలియన్‌ డాలర్లకు చేరడం విశేషం. 

మరో క్రిప్టోకరెన్సీ ఎథిరియం విలువ సైతం 3.7 శాతం పెరిగి 1924.3 డాలర్లకు చేరుకుంది. దీని  మార్కెట్‌ విలువ 231.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  డాజీకాయిన్‌  కూడా 2.4 శాతం మేర వృద్ధి చెంది 0.1 డాలర్లకు చేరుకుంది. సొలానా 5 శాతం వృద్ధితో 21.3 డాలర్లకు పెరిగింది.  షిబా ఇను  విలువ 2.4 శాతం వృద్ధి చెందింది.