ఆ ఊరిలో 100కి పైగా ఆలయాలు

 ఆ ఊరిలో 100కి పైగా ఆలయాలు

పక్కనే గోదావరి నది ప్రవాహం.చుట్టూ పంట పొలాలతో ఆహ్లదకర వాతావరణం. గ్రామంలో ఎక్కడ చూసినా ఆలయాలతో ఆద్యాత్మిక వాతావరణం. అందరూ భక్తి మార్గాన్ని ఆచరించటం... ఇది నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో పరిస్థితి. ఆ ఊరిలో 100కి పైగా ఆలయాలున్నాయంటే అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ గ్రామం వివరాలు తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లా వెళ్ళాల్సిందే.  

ఊరంతా గుళ్ళతో నిండిపోయిన ఈ గ్రామం పేరు బినోల. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని బినోలలో  100కి పైగా ఆలయాలున్నాయి. మనకు తెలిసిన ఆలయాలతో పాటు పురాణాలు, గ్రంథాల్లోని అనేక ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి.రెండు వేల జనాభా ఉన్న  ఈ గ్రామం అంతటా ఆధ్యాత్మిక  వాతావరణం కనిపిస్తుంది. బాసర క్షేత్రానికి ముందుగా ఉండే  ఈ గ్రామం పక్క నుంచి గోదావరి ప్రవహిస్తుంది. 

గ్రామానికి గోదావరి ఉత్తరం వైపు ప్రవహిస్తూ ఉండటంతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక క్షేత్రంగ పేరుపొందింది. బినోల గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. రామాయణాన్ని రచించిన వాల్మీకి సమాధి అయింది ఇక్కడే. రాఘవేంద్ర స్వామీ సమాధి అయింది మంత్రాలయం అని, వ్యాసుడు సమాధి అయింది బాసర క్షేత్రం అని... అందరికీ తెలుసు. కానీ, రామాయణ గ్రంథాన్ని రాసిన వాల్మీకి సమాధి అయింది బినోల గ్రామంలోనే అని చాలా ఏళ్ళ వరకు ఎవరికీ తెలియదు.  గీదావరికి అటూ వైపు బాసరలో వ్యాసుడు, ఇటూ వైపు బినోలలో వాల్మీకి సమాధులు మనకు కనిపిస్తాయి. 

బినోల గ్రామాన్ని మొదట్లో  ఖస్సా గా పిలిచేవాళ్లు. తర్వాత బినోలగా మారింది. ఇక్కడి ఆలయాలో ముఖ్యమైనది సింధూర సిద్ధి వినాయక టెంపుల్. స్వామివారికి సింధూర లేపనం చేసిన వారికి కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఇక్కడి భువనేశ్వరి ఆలయం చాలా ఫేమస్.  అమ్మవారిని పూర్వము కాళిక మాత అమ్మవారిగా పూజించేవారు. గ్రామంలోని అన్నపూర్ణ దేవి, కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ప్రత్యేకమైనవే. గ్రామంలో కరువు ఏర్పడినప్పుడు ప్రజలు గోదావరి గంగా జలాలను తీసుకు వచ్చి స్వామివారి గర్భగుడిలో నింపి ఐదు రోజులు ఉంచుతారు. తర్వాత ఆ నీటీని గోదావరిలో వదిలి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. 

గ్రామంలోని సీతారామ ఆలయంలో  శ్రీరామనవమి కన్నుల పండువగా జరుగుతుంది. పూర్వం వాల్మీకి గోదావరిలో స్నానం చేసి ఇక్కడే ఆచమనం చేసేవారని ప్రచారంలో ఉంది. గోదావరి తీరంలో ఉన్న గౌతమేశ్వర ఆలయాన్ని  గౌతమ ముని ప్రతిష్టించారని స్థానికులు చెబుతుంటారు.  ముత్యాలమ్మ, మహాలక్ష్మి, నల్ల పోచమ్మ,కంకణాలమ్మ దేవతలుగా ఉన్నారు. బినోలలో శివ పంచాక్షరి వృక్షం ఉంది.  ఈ వృక్షము కాశీతో పాటు బినోలలో మాత్రమే కనిపిస్తుంది.  ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. బినోలా గ్రామానికి నాలుగు దిక్కులుగా  ఆంజనేయ స్వామి ఉన్నారు. ఒకటి తూర్పు ముఖ  ఆంజనేయ స్వామి, దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి , పశ్చిమ ముఖ ఆంజనేయ స్వామి , ఉత్తర ముఖ ఆంజనేయ స్వామి , నాలుగు దిశలుగా నాలుగు ముక్కలుగా ఆ గ్రామాన్ని కాపాడుతున్నారని ప్రజల నమ్మకం. 

బినోలలో పూర్వం మరాఠీలు, బ్రాహ్మణూలు ఎక్కువగా ఉండేవారు.350 గడపలుండేవి. ఆదిశంకరాచార్యుల శాపం వల్ల బ్రాహ్మణ కుటుంబాలు అంతరించిపోయాయని ప్రచారంలో ఉంది.  గతంలో జైన మతస్థులూ ఇక్కడ ఉండేవారు. గ్రామ చెరువు కట్ట మీదున్న మహవీరుని విగ్రహమే ఇందుకు నిదర్శమంటారు స్థానికులు. బినోలలోని ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని చెబుతున్నారు గ్రామస్థులు.