హైదరాబాద్: గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సచ్చిపోయి బీజేపీని గెలిపించిందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేసి తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమన్నారు. బీఆర్ఎస్తో కలిసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీ అడ్డుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డేనని ఆరోపించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.
తెలంగాణ, జూబ్లీహిల్స్‌కు ఏం చేశారని బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31) వెంగళరావు నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే నమ్మకం ఉందన్నారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని.. అవకాశం అందరికీ అన్నిసార్లు రాకపోవచ్చన్నారు. అవకాశం వస్తే మన కోసం కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోవాలని.. మనకోసం కష్టపడే వ్యక్తిని నెగ్గించుకోకపోతే చారిత్రక తప్పిదమే అవుతుందని అన్నారు.
‘‘జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్ పేరుతో ఆశీర్వదించాలంటూ బీఆర్ఎస్ ముందుకొచ్చింది. 2007లో పేద ప్రజల ఆశాజ్యోతి పీజేఆర్ చనిపోయారు. పీజేఆర్ అకాల మరణంతో ఆనాడు ఎన్నిక ఏకగ్రీవం చేశారు. పీజేఆర్ గౌరవార్ధం రాజకీయ వైరుద్ధ్యాన్ని పెట్టి ఎన్నిక ఏకగ్రీవానికి చంద్రబాబు సహకరించారు. కానీ పీజేఆర్ కుటుంబంపై పోటీకి బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టింది. ఇవాళేమో సానుభూతి పేరుతో ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు అడుగుతుంది. ఈ దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ నేతలు కాదా..? పీజేఆర్ కుటుంబపైనే అభ్యర్థిని నిలబెట్టిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు సానుభూతి ఓట్లు అడిగే హక్కు ఉందా..? అని రేవంత్ ప్రశ్నించారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ సానుభూతి ముసుగులో గెలవాలని చూసిందని.. కానీ శ్రీగణేష్ తోనే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమని ప్రజలు అతడికి పట్టం కట్టారని అన్నారు. నాకు కుడి భుజంగా నవీన్ గెలుపును ఇవ్వండి.. అభివృద్ధి నేను చూపిస్తానన్నారు. రాబోయే 40 ఏళ్లు మీకు నవీన్ అండగా ఉంటాడని.. అతడిని భారీ మెజారిటీతో గెలిపియ్యండని విజ్ఞప్తి చేశారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ నేతలు వస్తే కర్రుకాల్చి వాత పెట్టండని అన్నారు.
