Women's ODI World Cup 2025: ఆస్ట్రేలియాను చేజేతులా ఓడించిన కెప్టెన్.. ఇండియాకు వచ్చిన స్టార్క్‌కు చేదు జ్ఞాపకం

Women's ODI World Cup 2025: ఆస్ట్రేలియాను చేజేతులా ఓడించిన కెప్టెన్.. ఇండియాకు వచ్చిన స్టార్క్‌కు చేదు జ్ఞాపకం

వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడినప్పటికీ టీమిండియాపై ఓటమి తప్పలేదు. మొదటి బ్యాటింగ్ చేసి 338 పరుగుల భారీ స్కోర్ చేసి భారత జట్టుకు ఛాలెంజ్ విసిరింది. ఆ తర్వాత ఓపెనర్లను త్వరగా ఔట్ చేసి మ్యాచ్ పై పట్టు బిగించారు. ఇక ఆసీస్ విజయానికి తిరుగు లేదనుకుంటున్న సమయంలో టీమిండియా ప్లేయర్స్ జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ భారీ భాగస్వామ్యంతో జట్టును నిలబెట్టారు. కౌర్, జెమీమా మూడో వికెట్ కు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి విజయానికి బాటలు వేశారు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా వెనకడుగు వేసింది.   

వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వచ్చిన అవకాశాలను జారవిడిచింది. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ అలిస్సా హీలీ జట్టు ఓటమికి కారణమైంది. అందివచ్చిన రెండు ఈజీ ఛాన్స్ లను జారవిడిచింది. మొదట హర్మన్ ప్రీత్ కౌర్ ఈజీ స్టంపింగ్ ను మిస్ చేసిన హీలే.. ఆ తర్వాత జెమీమా ఇచ్చిన సులువైన క్యాచ్ ను జారవిడిచింది. ఆ సమయానికి రోడ్రిగ్స్ 82 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తుంది. ఇండియా స్కోర్ 206. ఈ సమయంలో జెమీమా ఔటై ఉంటే మ్యాచ్ లో ఆస్ట్రేలియా పట్టు సాధించేది. హీలే తన చెత్త ఫీల్డింగ్ తో పాటు కెప్టెన్సీలోనూ విఫలమైంది. అంతేకాదు బ్యాటింగ్ లోనూ 15 బంతుల్లో 5 పరుగులే చేసి విఫలమైంది.

ఇలా అన్ని విభాగాల్లో ఈ ఆసీస్ సారధి విఫలమై జట్టు విజయానికి కారణమైంది. హీలే కోసం ఇండియాకు వచ్చిన మిచెల్ స్టార్క్ తన భార్య ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆస్ట్రేలియా నుంచి మ్యాచ్ చేజారుతున్న సమయంలో విచారం వ్యక్తం చేశాడు. హీలే ఎక్కడ మ్యాచ్ ఆడిన స్టార్క్ చూడడానికి వెళ్తాడు. తన భార్య కోసం ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వెళ్లిన స్టార్క్ కు ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఇదిలా ఉంటే ఈ వరల్డ్ కప్ తనకు చివరి టోర్నీ అని ఆస్ట్రేలియా కెప్టెన్ కన్ఫర్మ్ చేసింది. లీగ్ దశలో వరుస సెంచరీలతో హోరెత్తించిన హీలే.. నాకౌట్ లో మాత్రం ఒత్తిడిలో చేతులెత్తేసింది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతం చేసింది. ఆస్ట్రేలియా విధించిన 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం (అక్టోబర్ 30) నవీ ముంబై వేదికగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో ముగిసిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ (127) వీరోచిత సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమిండియాకు విజయాన్ని అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో  338 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో ఇండియా 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి గెలిచింది.