Shivam Dube: ఆరేళ్ళ గోల్డెన్ లెగ్‌కు బ్రేక్.. దూబే అసాధారణ రికార్డుకు చెక్ పెట్టిన ఆస్ట్రేలియా

Shivam Dube: ఆరేళ్ళ గోల్డెన్ లెగ్‌కు బ్రేక్.. దూబే అసాధారణ రికార్డుకు చెక్ పెట్టిన ఆస్ట్రేలియా

టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే భారత జట్టుకు గోల్డెన్ లెగ్ లా మారాడు. అతడు జట్టులో ఉంటే చాలు విజయం ఖాయం అనేలా ఉంది. దూబే ఇప్పటివరకు భారత్ తరపున ఆడిన చివరి 36 మ్యాచ్ ల్లో విజయం సాధించడం విశేషం. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లోనూ టీమిండియా వరుస విజయాలు సాధించిన జట్టులో దూబే ఉన్నాడు. అయితే ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న  రికార్డుకు బ్రేక్ పడింది. శివమ్ దూబే జట్టులో ఉండగా భారత జట్టు ఓడిపోయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఇండియా ఓడిపోవడంతో దూబే ఆరేళ్ళ రికార్డ్ కు బ్రేక్ పడింది. 

ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో 4 పరుగులే చేసిన దూబే.. బౌలింగ్ వేయలేదు. మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బౌలింగ్ లో హేజల్ వుడ్ విజృంభించడంతో పాటు బ్యాటింగ్ లో మిచెల్ మార్ష్ (46) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలిచింది. హేజల్ వుడ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.       

2019 లో బంగ్లాదేశ్ పై మ్యాచ్ తో దూబే భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం వెస్టిండీస్ పై తొలి వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. దూబే ఇప్పటివరకు 4 వన్డేలు.. 41 టీ20 మ్యాచ్ లాడాడు. 2019 డిసెంబర్ నుంచి దూబే ప్లేయింగ్ 11లో ఉన్న ప్రతి మ్యాచ్ లోనూ భారత్ గెలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దూబేను టీమిండియా ప్రతి మ్యాచ్ లో ఆడించాలని కొంతమంది అంటుంటే.. దూబే భారత జట్టుకు దొరికిన వరం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఐదేళ్ల క్రితం అరంగేట్రం చేసినా ఐపీఎల్ 2024 తర్వాత ఈ ముంబై ఆల్ రౌండర్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన చివరి రెండు టీ20ల్లో అవకాశం దక్కించుకున్నాడు. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా నాలుగో టీ20లో హాఫ్ సెంచరీ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

ఆసియా కప్ 2025లో దూబే అద్భుతంగా రాణించాడు. ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాకపోయినా  బౌలింగ్ లో అదరగొట్టాడు. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టిన దూబే.. ఆ తర్వాత నిలకడగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ పాండ్య ఫైనల్లో లేకపోవడంతో కొత్త బంతితో బౌలింగ్ చేసిన దూబే.. 3 ఓవర్లు బౌలింగ్ వేసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్ లోనూ రాణించి కీలక సమయంలో 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.