ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. జెమీమాతో కలిసి పాట పాడతా: సునీల్ గవాస్కర్

ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. జెమీమాతో కలిసి పాట పాడతా: సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతోన్న ఉమెన్స్ వరల్డ్ కప్‎లో అతిథ్య ఇండియా ఫైనల్‎కు దూసుకెళ్లింది. సెమీస్‎లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి సగర్వంగా భారత్ ఫైనల్‎కు చేరుకుంది. ఇండియా ఫైనల్‎కు వెళ్లిందంటే కారణం జెమీమా రోడ్రిగ్సే. ఇందులో ఎలాంటి సందేహాం అక్కర్లేదు. కళ్లముందు కొండంత లక్ష్యం.. మరోవైపు ఓపెనర్లు త్వరగా ఔట్ అయ్యారు.. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా అసాధారణ పోరాట పటిమ కనబర్చింది. మహిళల క్రికెట్లోనే బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాపై చివరి వరకు క్రీజులో నిలబడి వీరోచిత సెంచరీ చేసింది. జెమీమా చిరస్మరణీయ ఇన్సింగ్స్‎తో ఇండియా ఫైనల్‎ పోరుకు దూసుకెళ్లింది. 

ఓపిక లేకున్నా జట్టు విజయం కోసం శరీరంలోని బలాన్నంతా కూడగట్టుకుని చివరి వరకు క్రీజులో నిలబడి ఇండియాకు అపూర్వ విజయం అందించిన జెమీమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే టీమిండిమా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ జెమీమాపై పొగడ్తలు కురిపించారు. ఆస్ట్రేలియా వంటి బలమైన ప్రత్యర్థిపై జెమీమా ఇన్సింగ్స్ అద్భుతమని కొనియాడారు. 

తీవ్ర ఒత్తిడిలో జెమీమా చూపించిన పోరాటం అసాధారణమని ప్రశంసించారు. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ ఒక వాగ్ధానం చేశారు. ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ ఇండియా గెలిస్తే.. జెమీమా రోడ్రిగ్స్‏తో కలిసి ఒక పాట పాడుతానని చెప్పారు. ఆమె గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని అన్నారు. 

జెమీమాకు ఇష్టం ఉంటనే ఈ పని చేస్తానన్నారు. గతంలో ఓసారి బీసీసీఐ అవార్డుల కార్యక్రమం సందర్భంగా తాము ఇలా చేశామని గవాస్కర్ గుర్తు చేశారు. జెమీమా గిటార్ వాయిస్తుంటే.. తాను పాడానని వివరించారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే.. మరోసారి ఆ సీన్ రిపీట్ చేయాలనుకుంటున్నానని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.