ముగ్గురు పిల్లల నిబంధనలో జోక్యం చేసుకోలేం:హైకోర్టు

ముగ్గురు పిల్లల నిబంధనలో జోక్యం చేసుకోలేం:హైకోర్టు
  • పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసిన హైకోర్టు 

హైదరాబాద్, వెలుగు: ముగ్గురు పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిబంధనలో జోక్యం చేసుకోలేమంటూ గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు కాదంటూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసింది.

 స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థికి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండకూడదన్న పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌ 21(3)ని కొట్టివేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన ఉప్పు వీరన్న మరొకరు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. 

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌‌‌‌‌లతో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌ గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నిబంధన రాజ్యాంగం కల్పించిన అధికరణ 14, 19(1)(జి), 21లకు విరుద్ధమన్నారు. ఈ నిబంధనను రద్దు చేసి ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించాలన్నారు. 

ఈ నిబంధనను ప్రభుత్వం రద్దు చేస్తూ గెజిట్‌‌‌‌‌‌‌‌ జారీ చేసిందని, దీనికి గవర్నర్​ ఆమోదం లభించలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమన్నది ప్రాథమిక హక్కు పరిధిలోకి రాదని, ఇదేమీ వృత్తి, వ్యాపారం, ఉద్యోగాల నిర్వహణకు చెందిన ప్రాథమిక హక్కుకు ఉల్లంఘన కాదంటూ సుప్రీం కోర్టు జావెద్‌‌‌‌‌‌‌‌ వర్సెస్‌‌‌‌‌‌‌‌ హర్యానా కేసులో స్పష్టం చేసిందన్నారు. 

ఈ తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం అన్నది ప్రాథమిక హక్కు కాదని, అంతేగాకుండా ప్రభుత్వం పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ చట్టానికి తీసుకువచ్చిన సవరణను గవర్నరు ఆమోదించకపోవడంతో ఇంకా అమల్లోకి రాలేదన్నారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌లో హైకోర్టు జోక్యం చేసుకోలేదంటూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసింది.