 
                                    - ఓ ట్రావెల్ కంపెనీ డిజిటల్ వ్యాలెట్నుంచి కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
- 3 నెలల్లో కోట్లలో చీటింగ్
- ఐదుగురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
- మరో 9 సైబర్ కేసుల్లో 15 మంది అదుపులోకి
హైదరాబాద్ సిటీ, వెలుగు: టెక్నాలజీని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. సాఫ్ట్ వేర్‌లో లోపాన్ని గుర్తించి ఓ ట్రావెల్ కంపెనీ డిజిటల్వ్యాలెట్ నుంచి ఏకంగా 3 కోట్లు కొట్టేశారు. 3 నెలల్లోనే కోట్లలో చీటింగ్ చేసిన ఈ ముఠా చివరకు సైబరాబాద్ పోలీసులకు చిక్కింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి 28 వరకు 10 సైబర్ నేరాలను ఛేదించి, దేశవ్యాప్తంగా 20 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఈ ఆపరేషన్‌లో ట్రేడింగ్ ఫ్రాడ్స్‌తో సంబంధం ఉన్న 14 మంది నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 24 మొబైల్ ఫోన్లు, 19 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితుల్లో ఐదుగురు ఓ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వ్యాలెట్ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌ను కనిపెట్టి.. టికెట్‌బుక్ చేసి రీఫండ్ పేరిట రూ.3 కోట్లు కొట్టేసినట్టు పోలీసులు గుర్తించారు.
సాఫ్ట్‌వేర్‌లో బగ్స్ కనిపెట్టి..
దక్షిణాది రాష్ట్రాల్లో బస్సులు తిప్పుతున్న ఓ ప్రముఖ ట్రావెల్ కంపెనీ టికెట్బుకింగ్ కోసం ఓ సాఫ్ట్ వేర్రన్ చేస్తున్నది. ఇందులోనే సదరు కంపెనీ డిజిటల్వ్యాలెట్ కూడా ఉంది. దీనిపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు అందులో లోపాన్ని కనుగొన్నారు. ఈ ఏడాది మే నుంచి జులై మధ్య కాలంలో తమ పని కానిచ్చారు. ముందు వ్యాలెట్‌లో మనీ లోడ్ చేసుకొని, తర్వాత టికెట్‌బుక్ చేసుకునేవారు.
సెకన్లలోనే ఆ టికెట్‌ను క్యాన్సిల్ చేయడంతో వ్యాలెట్ నుంచి డబ్బులు కట్కాకపోయేవి. అలాగే, టికెట్ బుక్ అయినట్టు, క్యాన్సిల్ అయినట్టు మెసేజ్వచ్చి టికెట్ బుక్ చేసిన మొత్తానికి రీఫండ్ వ్యాలెట్‌లో క్రెడిట్అయ్యేది. ఈ ప్రక్రియను పదేపదే రిపీట్ చేసిన మోసగాళ్లు సదరు కంపెనీ నుంచి పలు దఫాలుగా రూ.3,00,91,683 తమ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కస్టమర్ల కోసం కూడా బుకింగ్స్ చేసి వ్యాలెట్‌లో రీఫండ్ పొందినట్టు తెలిసింది. వీరికి కొంతమంది సంస్థ ఏజెంట్లు కూడా సహకరించారు.
పొంతన కుదరకపోవడంతో..
కంపెనీలో బుక్‌చేసిన టికెట్లు, వచ్చిన డబ్బులకు సరిపోకపోవడంతో సదరు సంస్థ ఇంటర్నల్ఆడిట్నిర్వహించింది. డిజిటల్ వ్యాలెట్ రీఫండ్ సిస్టమ్‌లో ఒక టెక్నికల్ఎర్రర్ను కొంతమంది యూజర్లు ఉపయోగించుకున్నారని, వీరికి తమ కంపెనీ ఏజెంట్లు సహకరించారని తెలిసింది. అన్ని ఆధారాలతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసులో ప్రధాన నిందితులైన చెన్నుపాటి శివన్నారాయణ, కడలి నారాయణస్వామి, అనుగుల రాజ్‌కుమార్, జడ్డ బ్రహ్మయ్య, పెరిచెర్ల వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ మెయింటెయిన్ చేస్తున్న వారు రెగ్యులర్‌గా సాఫ్ట్వేర్ ఆడిట్ చేసుకోవాలని సూచించారు.

 
         
                     
                     
                    