ఎస్ఎల్బీసీ పనులు 24 గంటలూ కొనసాగాలి..ఆ ప్రాజెక్టు కోసమే ప్రత్యేకంగా సీఈ నియామకం: మంత్రి ఉత్తమ్

ఎస్ఎల్బీసీ పనులు 24 గంటలూ కొనసాగాలి..ఆ ప్రాజెక్టు కోసమే ప్రత్యేకంగా సీఈ నియామకం: మంత్రి ఉత్తమ్
  • పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరిక
  • కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లకు ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీతో త్వరలో భేటీ

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్​బీసీ టన్నెల్​ పనులు 24 గంటలూ కొనసాగాలని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. పనుల్లో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటించాలని, వెంటనే నిర్మాణ సామగ్రిని తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పనులు ఆలస్యమైనా, నిర్లక్ష్యం కనబరిచినా సహించేది లేదన్నారు. హైదరాబాద్ లో ఆదివారం అధికారులతో ఆయన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

 ఎస్ఎల్​బీసీలో మిగిలిపోయిన పనుల కోసం నేషనల్​ జియోగ్రాఫికల్​ రీసెర్చ్​ ఇన్ స్టిట్యూట్​ (ఎన్​జీఆర్ఐ) చేపట్టిన ఏరియల్​ ఎలక్ట్రోమాగ్నటిక్​ సర్వే పూర్తయిందని, దానికి సంబంధించిన నివేదిక వచ్చిందని చెప్పారు. అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి సొరంగం పనులు చేయాలని, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు కోసం ప్రత్యేక డివిజన్​ను ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన.. ప్రత్యేకంగా ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు కోసమే ఒక చీఫ్​ ఇంజినీర్​ను నియమిస్తామని తెలిపారు. 

సీఈకి సహకరించేలా ఇండిపెండెంట్​ సూపర్​విజన్​ కన్సల్టెంట్​(ఐఎస్​సీ) ను నియమించాలన్నారు. ప్రాజెక్టు కోసం ఓ ప్లానింగ్​ టీమ్​ను ఏర్పాటు చేసుకోవాలని, రోజువారీ పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. టన్నెల్​ వద్ద భద్రత కోసం సింగరేణి నిపుణులను ప్రాజెక్టు సైట్​ వద్ద మోహరించాలన్నారు. నేల పరిస్థితులను అంచనా వేసేందుకు జియోటెక్నికల్, జియోలాజికల్​ టీమ్స్​ను కూడా నియమించాలన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసర్చ్​ స్టేషన్​ (సీడబ్ల్యూపీఆర్ఎస్​) చేసే టెస్టుల నివేదిక ఆధారంగా డిజైన్లను ఖరారు చేయాలన్నారు. ఈనెల 16 తర్వాత నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) ఎక్స్​పర్ట్​ కమిటీతో సమావేశం నిర్వహిస్తామని, బ్యారేజీల రిపేర్లకు సమగ్రమైన సాంకేతిక ప్రమాణాలను ఇవ్వాల్సిందిగా కోరుతామని చెప్పారు.