తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం : శ్రీధర్ బాబు

తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం : శ్రీధర్ బాబు
  • సబ్​కా సాథ్ ​సబ్​కా వికాస్ విషయంలో రాష్ట్రానికి నీటిమూటలే: శ్రీధర్​ బాబు
  • బడ్జెట్​లో రాజకీయ అనుకూలతలకే ప్రాధన్యమిచ్చారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాల ఆర్థిక స్వావలంబన లేనిదే దేశాభివృద్ధి సాధ్యపడదని రాజ్యాంగం చెప్తే.. కేంద్రం మాత్రం ఈ బడ్జెట్​లో ఆ మూలసూత్రాన్నే విస్మరించిందని మంత్రి శ్రీధర్​బాబు ఆరోపించారు. దేశ జీడీపీలో 5 శాతానికిపైగా వాటాను కలిగిన తెలంగాణ గురించి బడ్జెట్​ ప్రసంగంలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. కేంద్ర బడ్జెట్​పై ఆదివారం మంత్రి స్పందించారు. కేంద్రం తరచూ వల్లించే ‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్’ అనే నినాదం తెలంగాణ విషయంలో కేవలం నీటి మూటలేనని ఈ బడ్జెట్​తో స్పష్టమైందన్నారు.

ఓ వైపు అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉంటుందని చెబుతూనే, మరోవైపు నిధుల కేటాయింపుల్లో తెలంగాణ పట్ల రాజకీయ వివక్ష చూపడం రాజ్యాంగ నైతికత అనిపించుకోదన్నారు. ‘‘బడ్జెట్ ను ఆర్థిక హేతుబద్ధత ఆధారంగా రూపొందించాలి. కానీ, కేంద్రం రాజకీయ అనుకూలతకు ప్రాధాన్యమిచ్చి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో తెలంగాణకు రూ.22,782 కోట్లు వస్తాయని అంచనా వేస్తే.. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా అందింది కేవలం రూ.4 వేల కోట్లే. అంటే రావాల్సిన దాంట్లో 20 శాతం కూడా అందలేదు. ఇది తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న ఆర్థిక అణచివేతకు మరో సాక్ష్యం’’ అని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీలో సమన్యాయం పాటించాలని.. కానీ, సహకార సమాఖ్య సూత్రాలకు విరుద్ధంగా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తున్నదని మండిపడ్డారు.

రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్– 2, గోదావరి – మూసీ అనుసంధానం, బందరు పోర్టు-హైదరాబాద్ డ్రైపోర్టు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే, నాలుగు కొత్త విమానాశ్రయాలు, రైలు కనెక్టివిటీ మెరుగుదల, విభజన చట్టంలోని పెండింగ్ హామీల అమలుకు నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. హై స్పీడ్ రైల్ కారిడార్స్​తో తెలంగాణకు మమ అనిపించిన కేంద్ర ప్రభుత్వవివక్షపూరిత వైఖరిపై.. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎంపీలు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీధర్​బాబు డిమాండ్​ చేశారు.