న్యూఢిల్లీ: స్థూల జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది జనవరిలో 6.2 శాతం పెరిగి మూడు నెలల గరిష్ట స్థాయి అయిన రూ.1.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో పన్ను రేట్లు తగ్గించినా, వినియోగం పెరగడం వల్ల ఆదాయం పెరిగిందని అధికారిక వర్గాలు తెలిపాయి. గతేడాది చివరిలో రేట్లు తగ్గించిన సమయంలో.. అంటే నవంబరులో వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లకు తగ్గాయి. అయితే డిసెంబర్ నుంచి ఆదాయం పుంజుకుని జనవరి నాటికి అక్టోబర్,2025 నెల వసూళ్లకు చేరువగా వచ్చాయి.
జనవరి నెలలో రిఫండ్ల విలువ 3.1 శాతం తగ్గి రూ.22,665 కోట్లుగా నమోదయింది. దీనివల్ల నికర జీఎస్టీ ఆదాయం 7.6 శాతం వృద్ధి చెంది సుమారు రూ.1.71 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.41 లక్షల కోట్లు రాగా, దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.52,253 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వం సుమారు 375 వస్తువులపై పన్నులు తగ్గించింది.
గతంలో ఉన్న నాలుగు రకాల పన్ను స్లాబులను 5 శాతం నుంచి 18 శాతం వరకు ఉండే రెండు ప్రధాన స్లాబులుగా మార్చింది. జనవరిలో పొగాకు ఉత్పత్తుల నుంచి సెస్ రూపంలో రూ.5,768 కోట్లు వచ్చాయి. 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి మధ్య కాలంలో మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.18.43 లక్షల కోట్లుగా నమోదై 8.3 శాతం వృద్ధిని కనబరిచాయి.
