ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికల  ప్రచారం
  •  
  • ప్రలోభాలకు తెరలేపిన అభ్యర్థులు
  • ఓట్ల కోసం మంతనాలు
  • భారీగా డబ్బులు, లిక్కర్ పంపిణీకి వ్యూహం

ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు:  మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. మైకుల మోతలు, నినాదాలతో మార్మోగిన పల్లెల్లో సాయంత్రం నుంచి ప్రశాంతత నెలకొంది. ఓటు వేసేందుకు జనాలు ఎదురుచూస్తుండగా.. వారిని ఆకర్షించేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు, మద్దతు పలుకుతున్న పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. 

పోలింగ్ కు ఒక రోజే సమయం ఉండటంతో ప్రలోభాలకు తెరలేపుతున్నారు. అన్ని పార్టీల నాయకులు తమ మద్దతదారుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నగదు, మద్యం, కానుకలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

జోరుగా ప్రలోభాలు

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ పంచాయతీల్లో డిమాండ్ బట్టి ఓటుకు రూ.500  నుంచి రూ.2 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పురుషులకు మద్యం, మహిళలకు చీరలు పంచుతున్నారు. యూత్​కు గ్రూపుగా పార్టీ ఇస్తున్నారు. 

నరాలు తెగే ఉత్కంఠతో వెలువడుతున్న రిజల్ట్స్

సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం ఒకెత్తయితే పోలింగ్, ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒక్కో ఓటు కీలకంగా మారుతూ నరాలు తెగే ఉత్కంఠతో రిజల్ట్స్ వెలువడుతున్నయి. ఓట్లు లెక్కింపు ప్రారంభం నుంచే అభ్యర్థుల్లో టెన్షన్ మొదలవుతోంది. ఒకటి, రెండు ఓట్లతో తేడాతో గెలిస్తే.. రీ కౌంటింగ్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఫలితం ఎలా వస్తుందోననే ఆందోళనకు గురవుతున్నారు. ఒక్క ఓటుతో, లక్కీ డ్రా తో చాలా చోట్ల అభ్యర్థులు గెలుపొందుతుండటంతో సర్పంచ్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మించిపోయాయని చర్చ జరుగుతోంది.