ప్లాస్టిక్ కాలుష్యంతో..మానవ మనుగడకు ముప్పు

ప్లాస్టిక్ కాలుష్యంతో..మానవ మనుగడకు ముప్పు

 ఈ ఏడు ధరిత్రి దినోత్సవం ప్లాస్టిక్ సమస్య మీద దృష్టి సారించింది. ధరిత్రి దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలు చైతన్యం కావాలని కోరుతున్నది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు తీసుకునే చర్యలు 

చాలా ముఖ్యమని గుర్తు చేస్తోంది. ప్రజాచైతన్యమే ప్రభుత్వాలను ఈ దిశగా ముందుకు నడిపిస్తాయని అంతర్జాతీయ పౌర సమాజం భావిస్తున్నది. 

పర్యావరణ సమస్యకు మించి ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ సమస్య వేగంగా విస్తరిస్తున్నది. ప్లాస్టిక్​ కాలుష్యంతో మానవ సమాజం మనుగడకే  ప్రమాదం వాటిల్లుతున్నది. మనం నిత్యం పారవేసే ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి వనరులలో చేరి మైక్రోప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌లుగా విడిపోయి, అత్యంత విషపూరిత రసాయనాలను నీటి వనరులలోకి విడుదల చేస్తున్నాయి. పీల్చే గాలిలో కలిసి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి ఇప్పుడు సంవత్సరానికి 380 మిలియన్ టన్నులకు పైగా పెరిగింది. మొత్తం 20వ శతాబ్దంలో ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ కంటే..గత పదేండ్లలో ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సంవత్సరానికి 400 మిలియన్ టన్నులకు చేరుకుందని అంచనా.  ప్లాస్టిక్ ఉత్పత్తిని అరికట్టకపోతే 2040లోపే ఇది రెట్టింపు అవుతుందని అంచనా. 

జీవవైవిధ్యంపై ప్రభావం

బిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వినియోగం అనేక ప్రాంతాలలో సహజ పర్యావరణ వ్యవస్థల విధ్వంసానికి ఇప్పటికే దారితీసింది.  ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వల్ల విష వాయువులు వెలువడి ఆహారం, నీరు కలుషితం అవుతున్నాయి. అనేక పట్టణాలలో,  పల్లెలలో ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుచేసి, పారేయడం ఒక పధ్ధతి అయితే,  ఇంకొందరు వాటిని కాల్చివేస్తున్నారు.  నిత్యం ప్లాస్టిక్​ కాల్చడం వల్ల ప్రమాదకర వాయువులు గాలిలో కలుస్తున్నాయి. కొందరు ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చి వంట కూడా చేస్తున్నారు. సూక్ష్మ ప్లాస్టిక్ వస్తువుల (మైక్రోప్లాస్టిక్స్) వినియోగం పెరగడం వల్ల సహజ పర్యావరణ వ్యవస్థలు కలుషితం అవుతున్నాయి. సేకరించడం కష్టమైన వాటిని మైక్రో ప్లాస్టిక్స్ గా భావించవచ్చు. మైక్రో ప్లాస్టిక్ ఆహారంలో,  నీటిలో చేరి ప్లాస్టిక్ కాలుష్యం నేరుగా మనుష్యుల ఆరోగ్యంపై తొందరగా ప్రభావం చూపే దశకు చేరుకున్నాం. 

ప్లాస్టిక్ కాలుష్యం ధరిత్రి సమస్య

మన ఆధునిక జీవనశైలి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్నది. అపార్ట్​మెంట్​ సంస్కృతి వల్ల కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అవుతున్నది. ప్లాస్టిక్ బాధ పోవాలంటే ఉత్పత్తి తగ్గడంతో పాటు వాటి ఉపయోగం కూడా తగ్గితే, డిమాండ్ తగ్గుతుంది. అన్నింటికీ ప్లాస్టిక్ వాడే బదులు అవసరమైనవాటికే  ప్లాస్టిక్ వాడితే కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గుతాయి.  ప్రతి మనిషి తన ప్లాస్టిక్ వినియోగం మీద దృష్టి పెట్టి, ఎక్కడ తగ్గించాలో ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గించవచ్చు. ప్లాస్టిక్ ఉత్పత్తిలో  మైక్రో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా ఉన్నది. ఒకసారి వాడి పారేసే (single use) ప్లాస్టిక్ తో పాటు,  అసలు అవసరం లేని (Zero use) ప్లాస్టిక్ కూడా ఉత్పత్తి అవుతున్నది. ప్యాకేజింగ్ పరిశ్రమ పూర్తిగా ప్లాస్టిక్ మీద ఆధారపడి, అనవసర వినియోగాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు. ఇటువంటి అనవసర ప్లాస్టిక్ వినియోగం మీద  ప్రభుత్వ నియంత్రణ అవసరం ఉంది.    

ప్లాస్టిక్ వ్యర్థాల గుట్టలు

వ్యర్థాలు సముద్రంలో చేరడమే కాకుండా, 46% ప్లాస్టిక్ వ్యర్థాలు భూమి మీద గుట్టలుగా మిగులుతాయని అంచనా.  ప్రపంచవ్యాప్తంగా 22% ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేదని అధ్యయనాలు చెబుతున్నాయి.  ప్రపంచదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల్లో 17 శాతం కాల్చేస్తున్నారు. కేవలం 15 శాతం మాత్రమే పునర్వినియోగం (రీసైక్లింగ్) అవుతున్నాయని అంచనా. అయితే, ఈ రెండు ప్రక్రియల ద్వారా కూడా గాలి కాలుష్యం అవుతున్నది. ప్లాస్టిక్ ఉపయోగం క్రమంగా తగ్గించుకోవడమే సుస్థిర మార్గం. దీర్ఘకాలిక పరిష్కారం అంటే ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ పదార్థాల వాడకం. ప్రస్తుతం వినియోగంలో  ప్లాస్టిక్ వస్తువులు వ్యర్థాలుగా మారతాయి. వాటి వల్ల కాలుష్యం పెరగకుండా చూడాల్సిన బాధ్యతతో పాటు, కొత్త ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రించాల్సిన అవసరం కూడా ఉన్నది.  ప్రస్తుతం వ్యర్థాలుగా ఉన్న ప్లాస్టిక్ వస్తువులు జీవావరణ వ్యవస్థలను, సముద్రాలను, నీటి వనరుల నుంచి తీసి తగువిధంగా నిర్వహించాలి. ఈ  సమష్టి బాధ్యత  ప్రపంచం మీద ఉన్నది. 

అంతర్జాతీయ ఒప్పందం

2024 ఏప్రిల్ 23న, 175 దేశాలకు చెందిన నాయకులు గ్లోబల్ ప్లాస్టిక్ వినియోగం నియంత్రించడానికి ఒక మైలురాయి ఒప్పందంపై చర్చించనున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 2022లో,  ఐక్యరాజ్యసమితి పర్యావరణ అసెంబ్లీ  ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ, చట్టబద్ధమైన ఒడంబడిక అభివృద్ధి చేయడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఒప్పందం 2024 చివరినాటికి పూర్తి అవుతుంది అని  భావిస్తున్నారు.  మొత్తం ప్లాస్టిక్  జీవితచక్రంపై దృష్టి సారించి,  సుస్థిరమైన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి  ఒక సమగ్ర విధానాన్ని ఈ ఒప్పందం ద్వారా సాధించవచ్చు అని ఆశిస్తున్నారు.

 అదనంగా, వనరుల సామర్థ్యం పెంచడం, వ్యర్థాలను నివారించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను సమస్యను పరిమాణపరంగా తగ్గిస్తూ,  పరిష్కరాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.  2022 డిసెంబర్లో ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ కమిటీ (INC-1) మొదటి సమావేశంలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్​లో  జరిగేది 4వ సమావేశం. ఈ సమావేశం ప్రపంచానికి ప్లాస్టిక్ మీద ఒప్పందాన్ని అందించడంలో కచ్చితమైన పురోగతిని 
సాధిస్తుంది అని ఆశిద్దాం. 

సుస్థిర పరిష్కారం

కర్బన ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాలను తగ్గిస్తూ,  ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచే క్రమంలో ప్లాస్టిక్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఎందుకంటే, ప్లాస్టిక్ ఉత్పత్తి క్రూడ్ ఆయిల్ శుద్ధి నుంచి వస్తుంది కనుక. క్రూడ్ ఆయిల్ వినియోగం తగ్గితే ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గవచ్చు. అందుకే, ప్రత్యామ్నాయ ఇంధనాలతో పాటు ప్లాస్టిక్​కు
 ప్రత్యామ్నాయాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలి. మనుషులు ధరించే వస్త్రాలలో పత్తి, పట్టు, ఉన్ని వంటి సహజ నూలు వస్త్రాలను ప్రోత్సహిస్తే  వేల టన్నుల పాలిస్టర్ వస్త్ర వ్యర్థాలు తగ్గుతాయి. ఎక్కడ వీలు అయితే అక్కడ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచి, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. భారతదేశంలో చేనేత రంగానికి ఊతం ఇస్తే  ప్లాస్టిక్ తగ్గించవచ్చు. కాలుష్యం తగ్గుతుంది, వ్యర్థాలు తగ్గుతాయి, ఉపాధి పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ లాభపడుతుంది. 

సముద్ర వ్యర్థాలలో 85% ప్లాస్టిక్

మొత్తం సముద్ర వ్యర్థాలలో ప్లాస్టిక్ 85% ఉందని అంచనా. ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచో సముద్రంలోకి చేరినవి. కొన్ని దేశాల మధ్య వ్యర్థాల వ్యాపారం చేసే సంస్థలు వాటిని ఓడల ద్వారా తెచ్చి సముద్రంలో పారవేస్తుంటాయి. విపరీతంగా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జీవులకు  ప్రాణ సంకటంగా మారినాయి. సముద్ర జీవావరణ వ్యవస్థ వీటి వలన తీవ్ర ప్రమాదంలో పడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక సముద్ర తీరాలు, బీచ్​లు వివిధ దేశాలలో ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనపడుతున్నాయి. 

దీనిని బట్టే ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు ఆ ప్రాంతానికే పరిమితం కావని అర్థం అవుతున్నది. 2050 నాటికి మహా సముద్రాలలో చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుంది అని భావిస్తున్నారు. వాగులు, చెరువులు, నదులు, సముద్రాలతో పాటు, ఉత్తర, దక్షిణ ధ్రువ సముద్రపు మంచులో, లోతైన సముద్ర కందకాల వరకు - భూమిపై ప్రతి ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు విస్తరించాయి.  ఈ వ్యర్థాలు ఎండకు, వానకు, గాలికి, సముద్రంలో ఉప్పు నీటికి పగిలిపోతూ, చిన్న సూక్ష్మ పరిమాణంలోకి మారి, కంటికి కనపడని కణాలుగా, ఫైబర్ గా మారుతున్నాయి. వీటిని మైక్రో ప్లాస్టిక్ అని పిలుస్తున్నారు. ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలు తాగే నీటిలో,  చేపలలో,  సముద్ర జలచరాల శరీరాలలో చేరి, తరువాత క్రమంగా మనుష్యులలో చేరుతున్నాయి.

-  డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​