ఫిబ్రవరి 16 నుంచి బయో ఆసియా సదస్సు

ఫిబ్రవరి  16 నుంచి బయో ఆసియా సదస్సు
  •     మూడు రోజుల పాటు 23వ ఎడిషన్     పోస్టర్​ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
  •     టెక్ బయో అన్ లీష్డ్ - ఏఐ ఆటోమేషన్, బయాలజీ రెవల్యూషన్ థీమ్ తో నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: బయో ఆసియా 23వ ఎడిషన్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్నది. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు బయో ఆసియా సదస్సు నిర్వహించబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. “టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బయో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్  అండ్  బయాలజీ రెవల్యూషన్” థీమ్ తో ఈ ఏడాది బయో ఆసియా సదస్సు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. గురువారం సచివాలయంలో బయో ఆసియా 2026 పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడంలో లైఫ్ సైన్సెస్  రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బయో ఏషియా వంటి అంతర్జాతీయ సదస్సులు తెలంగాణ నాయకత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడంతో పాటు కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి కొత్త మార్గాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. బయో ఏషియా 2026తో టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బయో విప్లవాన్ని ముందుకు నడిపిస్తూ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ నిపుణులను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకే వేదికపైకి తీసుకురావడం తమ లక్ష్యమన్నారు. 

స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పరిశోధకులు, పరిశ్రమల నాయకులు, పాలసీ మేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య సహకారాన్ని పెంచే శక్తివంతమైన వేదికగా ఈ సదస్సు నిలుస్తుందని పరిశ్రమల శాఖ స్పెషల్  సెక్రటరీ సంజయ్ కుమార్ చెప్పారు. పెట్టుబడులు, భాగస్వామ్యాలు, సాంకేతిక మార్పిడి కోసం ఈ సదస్సు కీలక అవకాశాలను అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుత కాలంలో టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బయో ఆరోగ్యరంగాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోందని తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్  సీఈఓ శక్తి నాగప్పన్  చెప్పారు. బయాలజీ, ఏఐ, ఆటోమేషన్, డేటా కలయికతో కొత్త ఆవిష్కరణలు, పెట్టుబడులకు మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. బయో ఏషియా 2026 కేవలం చర్చల వేదికగా కాకుండా, ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చే వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఇదీ థీమ్..

టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బయో అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లీష్డ్ - ఏఐ, ఆటోమేషన్  అండ్  బయాలజీ రెవల్యూషన్  థీమ్ ద్వారా బయాలజీ, డేటా, డీప్ టెక్నాలజీ కలయికతో ప్రపంచవ్యాప్తంగా ఔషధ ఆవిష్కరణలు, నిర్ధారణ పద్ధతులు, ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులపై ఫోకస్  చేయనున్నారు. టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బయో వల్ల వ్యాధులను అర్థం చేసుకునే విధానం, చికిత్సలను అందించే విధానం, వైద్య సేవలను అందించే విధానం పూర్తిగా మార్పు చెందుతుందని ఆశిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ మరింత స్థిరంగా, సమానంగా, అందరికీ చేరువయ్యేలా రూపుదిద్దుకునేలా ఈ సదస్సు దోహదం చేయనుంది.