ఖమ్మం టౌన్, వెలుగు: ‘సామాన్యుడిని అయిన నాకు ఇంతటి గుర్తింపు ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాను’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానంలో 40 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలో ఆత్మీయ అభిమాన సత్కార సభ ఏర్పాటు చేశారు.
ముందుగా పార్టీ శ్రేణులు, అభిమానులు మంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి రాపర్తినగర్ బోర్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి తుమ్మలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా సభా స్థలానికి చేరుకునే క్రమంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తర్వాత జరిగిన సభలో మంత్రి ఆత్మీయులు, బాల్యమిత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ... ఉమ్మడి ఏపీలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ఆ శ్రీరామచంద్రుడు, ప్రజల ఆశీర్వాదంతో తాను ఈ స్థాయికి ఎదిగినట్లు తెలిపారు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, ఖమ్మం అర్బన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, విత్తన గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ మేయర్ నీరజ పాల్గొన్నారు.
మచ్చలేని నాయకుడు మంత్రి తుమ్మల: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని
నలభై ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో తుమ్మల నాగేశ్వరరావు మచ్చలేని నాయకుడిగా ఎదిగారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. తుమ్మల ఆత్మీయ సత్కారానికి హాజరైన కూనంనేని మాట్లాడుతూ... ప్రస్తుతం రాజకీయాల్లోకి వ్యాపారస్తులు, గుండాయిజం చేసేటోళ్లు వస్తున్నారన్నారు.
కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసిన ప్రతిసారి ఆయన గెలుపును సన్నిహితులు భుజస్కంధాలపై వేసుకుని గెలుపుకు బాటలు వేస్తుంటారని చెప్పారు. మంత్రి తుమ్మల ఎంత కఠినంగా మాట్లాడుతారో.. దాని వెనుక మానవత్వం కూడా దాగి ఉంటుందన్నారు.
