
నేలకొండపల్లి, వెలుగు: పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్యాంప్ఆఫీసులో గురువారం గొడవ పడ్డ టీఆర్ఎస్లీడర్లు, కార్యకర్తలు శుక్రవారం కూడా దాన్ని కంటిన్యూ చేశారు. కాకపోతే ఈసారి డోస్మరింత పెంచారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, జడ్పీటీసీ బేబీ శేఖర్ ను తీసుకొని వచ్చారు. తర్వాత వీరి అనుచరులు మండల పరిషత్, తహసీల్దార్ఆఫీసుల ఆవరణకు చేరుకున్నారు. మరోపక్క కూసుమంచి సెంటర్ నుంచి రాజుపేట గ్రామానికి చెందిన కల్లూరిగూడెం సొసైటీ చైర్మన్వాసంశెట్టి వెంకటేశ్వర్లు తన అనుచరులతో వచ్చారు. దీంతో పోలీసులు ఎంపీడీఓ ఆఫీసు ఎదుట భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటూరి బేబీ, శేఖర్ మీటింగ్ హాలులో ఉండగా వాసంశెట్టి అనుచరులు నినాదాలు చేస్తూ మండల పరిషత్ ఆఫీసు దగ్గరకు వచ్చారు. దీంతో శేఖర్ వర్గీయులు కూడా మండల పరిషత్ ఆఫీసు ఆవరణలో నినాదాలు చేశారు. రెండువర్గాలు 20 మీటర్ల దూరంలో ఉండగా పోలీసులు ఎంపీడీఓ ఆఫీసు గేటుకు తాళం వేశారు. ఇంతలో వాసంశెట్టి వర్గానికి చెందిన కొంతమంది పక్కనే ఉన్న కొత్త బిల్డింగ్నిర్మాణానికి ఉంచిన రాళ్ళను శేఖర్ వర్గీయులపై విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించుకోవడంతో ఆఫీసులకు వివిధ పనుల కోసం వచ్చినవారు పరుగులు తీశారు. దీంతో పోలీసులు రెండు గ్రూపులకు చెందిన వారిని చెదరగొట్టారు. మండల సర్వసభ్య సమావేశం కూడా అర్ధంతరంగా రద్దయ్యింది.