Vastu tips: గుడి పక్కన ఇల్లు.. బాత్రూం గోడకు ఆనుకొని వంటగది.. పూజారూం ఉంటే నష్టాలొస్తాయా..!

Vastu tips:  గుడి పక్కన ఇల్లు.. బాత్రూం గోడకు ఆనుకొని వంటగది.. పూజారూం  ఉంటే నష్టాలొస్తాయా..!

ఇల్లు నిర్మించుకొనే విషయంలో  కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం. గతంలో కొన్న స్థలానికి ఎడమ పక్కన చిన్న దేవాలయం ఉంటే.. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా..! బాత్రూం గోడకు ఆనుకొని పూజారూం.. వంటగది ఉంటే నష్టాలొస్తాయా.. . .. మొదలగు విషయాల గురించి  వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారి సలహాలను ఒకసారి చూద్దాం

ప్రశ్న: ఏడేళ్ల క్రితం వికారాబాద్ దగ్గర రెండొందల గజాల స్థలం కొన్నాను. ఈ మధ్యే స్థలాన్ని చూద్దామని వెళ్లా. మా ప్లాట్ కి కుడిపక్కన అమ్మవారి గుడి చిన్నది కట్టారు. ఒక్కసారిగా షాక్ తిన్నాను. ఇంటికెళ్లి విషయం చెబితే, గుడి పక్కన ఇల్లు కడితే మంచిది కాదంటున్నారు. ఇప్పుడు ఆ స్థలాన్ని అమ్మాలో లేక ఇల్లు కట్టుకోవాలో అర్ధం కావట్లేదు. కట్టుకుంటే ఏదైనా దోషం జరుగుతుందా 

జవాబు : అన్నింటికంటే ముఖ్యం గుడికి ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనుక్కోవద్దు. దేవుడి చూపు పడేట్టుగా ఇల్లు కట్టుకోవద్దంటారు. అలాగే ఎక్కడైనా సరే స్త్రీ దేవతల గుడి నీడ ఇంటిపైన లేదా స్థలం మీద పడకూడదు. మీ ప్లాట్ పక్కన ఉన్నది చిన్నగుడే అంటున్నారు కాబట్టి పర్వాలేదు. ప్రస్తుతం చిన్నచిన్న గల్లీల్లో కూడా అమ్మవారి గుళ్లు వెలుస్తున్నాయి. వాటివల్ల దోషం ఏమీ ఉండదు. కాకపోతే ఇంటి ఎత్తుకంటే... గుడి ఎత్తు తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యా రాదు. 

పూర్వం అనేవాళ్లు గుడికి కుడివైపు ఇళ్లు కట్టుకోవద్దని. మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు... గుడి నీడ పడకుండా ఉండేలా కాస్తంత స్థలం వదిలేసి కట్టుకుంటే మంచిది. గుడికి మీ స్థలం ఎడమవైపు ఉంది కాబట్టి ఏ భయాలు పెట్టుకోనక్కర్లేదు.

ప్రశ్న:  మా పాత ఇంటిని వాస్తు చూపించకుండా కట్టాం. దాని వల్ల నేమో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చివరికి ఈ మధ్యే ఇల్లు అమ్మకానికి పెట్టాం. అయితే మాకు పక్క ఊళ్లో కొంత స్థలం ఉంది. దాంట్లో రెండు గదులు వేసుకోవాలి అనుకుంటున్నాం. స్థలం చిన్నగా ఉండటం వల్ల, బాత్రూమ్​ను  ఆనుకుని చిన్న వంటగది, దేవుడి గది కట్టాల్సి ఉంటుంది. ఆ రెండు గదుల గోడలు ఒకదానికొకటి తగలొచ్చా? అలా కడితే ఏమైనా చెడు జరుగుతుందా? మాకు తెలిసిన వాళ్లు అలా ఎలా కడతారని భయపెడుతున్నారు? ఇప్పటికే దెబ్బతిని ఉన్నాం. ఇంక రిస్క్ తీసుకోలేం. 

జవాబు: బాధలున్నాయని ఇంటిని అమ్మేస్తే. అవి వెంటనే తీరిపోవు. ఒకసారి మీ పాత ఇంటి వాస్తును నిపుణులకు చూపించండి. మరీ మార్చలేని దోషాలుంటేనే అమ్మండి. లేదంటే చిన్నచిన్న మార్పులు చేసుకున్నా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ల మాటలు, వీళ్ల మాటలు విని తొందరపడి ఇంటిని అమ్మడం పొరపాటు. ఎందుకంటే ఒక్క వాస్తు వల్లే సమస్యలు రావు. జాతక దోషాలు కూడా ఉంటాయి. మీరు అడిగిన మరో ప్రశ్న! బాత్రూమ్ గోడలకు వేరే గది తగలొచ్చా అని. నిరభ్యం తరంగా ఆ గోడలకు ఆనించి ఏ గది అయినా కట్టుకోవచ్చు. ముఖ్యంగా దేవుడి గదిని వద్దంటారు చాలామంది. నేనైతే దానివల్ల దోషాలు ఉంటాయని చెప్పను. ఎప్పుడైతే గదుల మధ్యన గోడలు వచ్చాయో, అప్పుడే వాటి మంచిచెడులు పూర్తిగా మారిపోతాయి.