కెనడాలోని పైలెట్‌కు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌

కెనడాలోని పైలెట్‌కు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌
  •     విమానం ఎక్కుతుండగా మద్యం వాసన.. ఎయిరిండియా పైలట్ అదుపులోకి
  •     కెనడాలోని వాంకోవర్ నుంచి ఢిల్లీకి బయల్దేరే క్రమంలో ఘటన 

ఢిల్లీ: విమానం ఎక్కుతుండగా మద్యం వాసన రావడంతో ఎయిర్ ఇండియా పైలట్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెనడాలోని వాంకోవర్ లో ఈ ఘటన జరిగింది. పైలట్ నుంచి మద్యం వాసన వస్తుందని గమనించిన విమానాశ్రయ సిబ్బంది ఒకరు అధికారులను అప్రమత్తం చేశారు. అతడికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ పైలట్ వాంకోవర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని నడపాల్సి ఉంది. 

ఈ ఘటనతో విమానం కాస్త ఆలస్యమైంది. డిసెంబర్ 23న ఇది చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఎయిరిండియా స్పందించింది. పైలట్ సురక్షితంగా విధులు నిర్వహించే సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన కెనడా అధికారులు అనంతరం అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. భద్రతా ప్రొటోకాల్ ను పరిగణనలోకి తీసుకుని వేరే పైలట్ కు బాధ్యతలు అప్పగించామని వెల్లడించింది.