ఆర్థిక అభివృద్ధి పేరిట చేపట్టే అనేక కార్యక్రమాలలో సహజంగానే పర్యావరణానికి హాని కలుగుతుంది. ఎంత ఆర్థిక అభివృద్ధి సాధించినప్పటికీ భూమిపై గల జీవజాతులు అన్నీ కూడా పూర్తిగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి, ఆర్థిక అభివృద్ధి కంటే పర్యావరణమే అధిక ప్రాముఖ్యత గలది. ఉదాహరణకు భారతదేశ రాజధాని ఢిల్లీ ఆర్థిక అభివృద్ధి సాధించినప్పటికీ పీల్చే స్వచ్ఛమైన గాలి కరువైనది. అపారమైన జీవవైవిధ్యం కలిగి ఉండి ఎన్నో పర్యావరణ ప్రయోజనాలు కలిగి ఉన్న ఆరావళి పర్వతశ్రేణులు ద్వారా ఎకో టూరిజం వృద్ధిచేసి ఆర్థిక అభివృద్ధిని సాధించాలి.
ఆరావళి శ్రేణులు సుమారు 1.8 నుంచి 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రపంచంలోనే అతి పురాతన పర్వత శ్రేణులు. ఆరావళిలో జరుగుతున్న అనియంత్రిత అక్రమ మైనింగ్, పర్యావరణంపై , దాని ప్రభావంపై మొట్టమొదటిసారిగా ఎమ్. సి. మెహతా అనే పర్యావరణ న్యాయవాది వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1985లో దాఖలైనది. ఆ తర్వాత అనేక సంవత్సరాలపాటు జరిగిన వివిధ పరిణామాల తర్వాత సుప్రీంకోర్టు, పర్యావరణ మంత్రిత్వ శాఖ కమిటీ సిఫారసులను అంగీకరించి, ఆరావళి హిల్ (ఆరావళి పర్వతం), ఆరావళి పర్వత శ్రేణి (ఆరావళి రేంజ్)లకు నవంబర్ 20, 2025 నాడు ఆరావళి నిర్వచనం చెప్పింది.
ఈ నిర్వచనం ప్రకారం ఆరావళి హిల్ అంటే ఆరావళి జిల్లాల్లో ఉన్న ఏ భూఆకృతి అయినా, స్థానిక ఉపశమనం ( లోకల్ రిలీఫ్) నుంచి 100 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉంటే అది ఆరావళి హిల్ గా పరిగణిస్తారు. ఆరావళి రేంజ్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆరావళి హిల్స్ ఒకదానికొకటి 500 మీటర్ల దూరంలో ఉంటే అవి ఆరావళి రేంజ్‌గా పరిగణిస్తారు.ఉన్నతస్థాయి కమిటీకి సుప్రీం సిఫార్సుసుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం.. మైనింగ్, రియల్ ఎస్టేట్, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఆరావళి పర్వత శ్రేణిని కేవలం దాని ఎత్తు ఆధారంగా నిర్వచించకుండా వాతావరణ, భూగర్భ, పర్యావరణ పరిరక్షణలలో వాటి ప్రాముఖ్యత ఆధారంగా, భౌగోళిక శాస్త్రం, జీవావరణ శాస్త్రం, వన్యప్రాణుల పరిరక్షణ వంటి శాస్త్రీయ ప్రమాణాలను ఉపయోగించి నిర్వచించాలి అని పర్యావరణవేత్తలు కోరుకుంటున్నారు. అంతర్జాతీయంగా, పర్వతాలు, కొండ వ్యవస్థలను ఎత్తు పరిమితుల ద్వారా కాకుండా అవి నిర్వర్తించే విధులను బట్టి గుర్తిస్తారని పర్యావరణవేత్తలు తెలిపారు.
ఈ నిర్వచనంపై తీవ్ర అభ్యంతరాలు, వ్యతిరేకత రావటంతో ఆరావళిలకు సంబంధించి నవంబర్ 20న తన సొంత తీర్పును (నిర్వచనాన్ని) సుప్రీంకోర్టు 29/12/2025నాడు, నిలిపివేసింది. ఉన్నత స్థాయి కమిటీ ద్వారా పునఃపరిశీలన చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో, అమితమయిన జీవవైవిధ్యంను కలిగి ఉండటం వలన అనేకమందికి జీవనోపాధిని కల్పించడంలో ఆరావళి శ్రేణి కీలకపాత్ర పోషిస్తున్నది.
థార్ ఎడారి విస్తరణను అడ్డుకునే పర్యావరణ రక్షణ కవచంగా ఇవి పనిచేస్తాయి. గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని కూడా పిలిచే థార్ ఎడారి, ప్రధానంగా వాయువ్య భారతదేశంలోని రాజస్తాన్ రాష్ట్రంలో ఉంది. ఇది ఆ రాష్ట్రంలో 60% కంటే ఎక్కువ భాగాన్ని ఆక్రమించి, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించి ఉంది, దీనిలో కొంత భాగం పాకిస్తాన్‌లో కూడా ఉంది.
పర్యావరణ విపత్తులుఆరావళిలో మొత్తం 12,081 కొండలు ఉండగా, వాటిలో కేవలం 1,048 మాత్రమే 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. దీని అర్థం ఆరావళి కొండలలో కేవలం 8.7% మాత్రమే రక్షిస్తారు. అంటే దాదాపు 90% తొలగిస్తారు. ఆరావళి పర్వతాలు తొలగించిన ప్రాంతంలో మైనింగ్, రియల్ ఎస్టేట్, వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించనున్నారు. మైనింగ్ వంటి కార్యకలాపాలు దుమ్ము, ధూళి వంటి వాటిని పక్క రాష్ట్రాలకు వ్యాపింప చేస్తాయి.
ఇప్పటికే వాయు కాలుష్యముతో బాధపడుతున్న ఢిల్లీలో వాయు కాలుష్యం మరింతగా పెరుగుతుంది. ఆరావళి శ్రేణులు ఎయిర్ ప్యూరిఫైయర్స్ వలె పనిచేస్తాయి. వీచే గాలుల వేగాన్ని మధ్యస్థంగా ఉంచుతాయి. వీటి తొలగింపు గాలి వేగాన్ని పెంచుతాయి. ఆరావళి కేవలం కొండలు కాదు. ఇవి భూగర్భ జలాలను తిరిగి భూమిలో రీఛార్జ్ చేయగలవు. మైనింగ్ వంటి కార్యక్రమాల వలన ఏర్పడే రాతి పొరల పగుళ్లు జలవనరుల కనెక్టివిటీని దెబ్బతీస్తాయి. భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే ప్రదేశాలు ఎండిపోతాయి. రాజస్తాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల మధ్య నీటి సంఘర్షణలు మొదలవుతాయి. ఇది భవిష్యత్తులో జలసంబంధమైన పతనాన్ని వేగవంతం చేస్తుంది. మైనింగ్, ఇతర వాణిజ్య కార్యక్రమాల వలన నేల సారవంతాన్ని కోల్పోతుంది. వ్యవసాయం దెబ్బతినటం వలన రైతులు, గ్రామీణ జీవితాలు దెబ్బతింటాయి. ఇది ఆహార భద్రతపై ప్రభావాన్ని చూపుతుంది.
పర్యావరణ అనుకూల ఆర్థిక అభివృద్ధి మైనింగ్, ఇతర వాణిజ్య కార్యక్రమాల ద్వారా పర్యావరణ వినాశనం చేసి ఆర్థిక అభివృద్ధి సాధించడం వలన జీవజాతికి తిరిగి కోలుకోలేని అపారమైన నష్టం కలుగుతుంది. ప్రకృతి అపారమైన ఆర్థిక సంపదకు నిలయం. ఆర్థిక అభివృద్ధి కోసం దురాశతో ప్రకృతిలో దాగి ఉన్న అపార సంపదను కొల్లగొట్టినట్లయితే సాధించిన ఆర్థిక అభివృద్ధిని అనుభవించడానికి భూమిపై జీవజాతి మిగలదు. పర్యావరణం, ఆర్థిక అభివృద్ధి రెండు ముఖ్యమైన అంశాలే. కానీ, ఆర్థిక అభివృద్ధి కోసం పర్యావరణానికి హాని కలగజేయలేం. కాబట్టి, పర్యావరణాన్ని, ఆర్థిక అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేసే సస్టైనబుల్ డెవలప్మెంట్ సరైన మార్గం.
- డా. శ్రీధరాల రాము,
ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్
