హైదరాబాద్ సిటీ బస్సుల్లోనూ లైవ్ ట్రాకింగ్

హైదరాబాద్ సిటీ బస్సుల్లోనూ లైవ్ ట్రాకింగ్

సమయానికి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నపుడు కొన్ని సార్లు బస్సులు టైంకి రాకపోవడం, అసలు ఆ బస్సు వస్తుందా, రాదా.. ఒకవేళ వస్తే ఎక్కుడుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి టీఎస్ఆర్టీసీ ఓ కొత్త ట్రాకింగ్ సిస్టమ్ ను తీసుకువచ్చింది. ఇప్పటికే దాదాపు దాదాపు 900 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అధునాతన వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్)ని విజయవంతంగా ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)... ఇప్పుడు సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ప్రయాణీకుల సౌకర్యార్థం ఈ ట్రాకింగ్ సిస్టమ్ బస్సు సర్వీసుల ఎక్స్‌పెక్టెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ (ETA)ని అందిస్తుంది. “ట్రాకింగ్ సిస్టమ్ తెలంగాణ, సమీప రాష్ట్రాలలో TSRTC సేవలు అందుబాటులో ఉన్న వివిధ స్టాప్‌లలో బస్సుల రాక, వెళ్లిపోవడానికి సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు తెలియజేస్తుంది . ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించి, ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. బస్ స్టాప్‌లలో నిరీక్షణ సమయాన్ని నివారించవచ్చు”అని టీఎస్‌ఆర్‌టీసీ సీనియర్ అధికారి తెలిపారు.

పైలట్ ప్రాజెక్ట్‌గా, కంటోన్మెంట్, మియాపూర్-2 డిపోలకు చెందిన AC పుష్పక్ బస్సులతో సహా 4వేల బస్సులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), శంషాబాద్‌కు వివిధ రూట్లలో, మియాపూర్-1, పికెట్ డిపోలకు చెందిన 100 సుదూర బస్సులు రూట్లలో నడపబడుతున్నాయి. శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, బెంగళూరు, విశాఖపట్నంలో 'TSRTC బస్ ట్రాకింగ్' అమర్చబడింది. ఇప్పుడు జిల్లాతో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన అన్ని రిజర్వేషన్ సేవలు, స్పెషల్ సర్వీసెస్ లకు వెహికల్ ట్రాకింగ్‌ను ప్రవేశపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు.

“కొన్నిసార్లు సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ, యాప్ బస్సు ప్రయాణికులకు చాలా సహాయకారిగా నిరూపిస్తోంది. వీలైనప్పుడల్లా ట్రాకింగ్ సిస్టమ్ గురించి అవగాహన కల్పించాలని తాము బస్ కండక్టర్లను ఆదేశించాం”అని అధికారి తెలిపారు. ప్రయాణికులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్ www.tsrtc.telangana.gov.in లో కూడా అందుబాటులో ఉంచారు.