ఉక్రెయిన్​పై రష్యా వార్

ఉక్రెయిన్​పై రష్యా వార్
  • రాజధాని కీవ్‌‌‌‌తోపాటు ఖార్కివ్, ఒడెస్సాలో మిలటరీ బేస్‌‌‌‌ల ధ్వంసం
  • రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌‌‌‌పైనా దాడులు.. పదుల సంఖ్యలో జనం మృతి
  • ఉక్రెయిన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ సిస్టమ్‌‌‌‌ను నాశనం చేసినం: రష్యా మిలటరీ
  • రష్యన్ విమానాలను కూల్చినం: ఉక్రెయిన్‌‌‌‌
  • నాలుగు రష్యన్​ బ్యాంకులపై బ్యాన్​.. 
  • 3 ట్రిలియన్​ డాలర్ల ఆస్తులు ఫ్రీజ్​ : బైడెన్​
  • ఉక్రెయిన్‌‌‌‌కు బలగాలను పంపట్లే: నాటో
  • హింసను ఆపండి: పుతిన్​కు మోడీ ఫోన్

కీవ్: కొన్ని రోజులుగా నెలకొన్న భయాలను నిజం చేస్తూ.. ఉక్రెయిన్‌‌‌‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది. మూడు వైపులా చుట్టుముట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. మిసైల్ దాడులతో విరుచుకుపడుతోంది. ఎయిర్​ఫోర్స్​, ఆర్మీ దాడులతో ఉక్రెయిన్​ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  గురువారం తెల్లవారుజామున సైబర్ అటాక్స్‌‌‌‌తో మొదలుపెట్టి.. మిలటరీ బేస్‌‌‌‌లు, ఎయిర్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ సిస్టమ్స్ లక్ష్యంగా అటాక్స్ చేసింది. రాజధాని కీవ్‌‌‌‌తోపాటు తూర్పున ఉన్న ఖార్కివ్, పశ్చిమాన ఉన్న ఒడెస్సా నగరంలో దాడులు చేసింది. కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్ సిస్టమ్‌‌‌‌ మొత్తాన్ని నాశనం చేసినట్లు రష్యా మిలటరీ వెల్లడించింది. అయితే అనేక రష్యన్ విమానాలను తాము కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌‌‌‌ చెప్పుకొచ్చింది. రష్యా దాడుల్లో 68 మంది దాకా చనిపోయినట్లు ప్రకటించింది. రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌‌‌‌పై జరిగిన దాడుల్లోనూ పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు.

మూడు వైపులా..
గురువారం ఉదయాన్నే రష్యా వైపు నుంచి వైమానిక దాడులు జరిగాయి. తర్వాత రష్యా మిలటరీ వాహనాలు క్రిమియా సరిహద్దుల గుండా ఉక్రెయిన్‌‌‌‌లోకి ప్రవేశించాయి. ఇటువైపున బెలారస్ నుంచి దాడులు జరిపాయి. దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ బార్డర్ గార్డ్ ఏజెన్సీ ప్రయత్నిస్తోంది. 
రెబల్స్ అధీనంలోని డోనెట్స్క్, లుహాన్స్క్‌‌ల నుంచి కూడా రష్యా అటాక్స్ జరిపింది. దీంతో ఉక్రెయిన్‌‌లోని ప్రధాన సిటీల్లో బాంబుల మోత మోగింది. చాలా సిటీల్లో రెసిడెన్షియల్ ఏరియాల్లోనూ బాంబులు పడ్డాయి. దీంతో పదుల సంఖ్యలో పౌరులు, సైనికులు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌‌ భూభాగంలోని ఖార్కివ్, చెర్నిహివ్ రీజియన్లతోపాటు ఇతర ఏరియాల్లోకి రష్యన్ దళాలు కొన్ని కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌స్కీ అడ్వైజర్ ఒలెస్కీ అరెస్టోవిచ్ చెప్పారు. కీవ్, ఖార్కివ్, నిప్రోలోని మిలటరీ కమాండ్ సెంటర్లు, ఎయిర్‌‌‌‌ బేస్‌‌లు, మిలటరీ డిపోలపై రష్యా మిస్సైల్ దాడులు చేసిందని ఉక్రెయిన్ హోం మంత్రి ఆంటోన్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఎయిర్‌‌‌‌స్పేస్ ప్రస్తుతం ‘కాన్‌‌ఫ్లిక్ట్ జోన్‌‌’లో ఉన్నట్లు యూరప్ అధికారులు ప్రకటించారు. 

ఉక్రెయిన్‌‌లో 30 రోజుల ఎమర్జెన్సీ
రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌‌స్కీ.. తమ దేశంలో మార్షల్‌‌లా ప్రకటించారు. తమ మిలటరీ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను రష్యా టార్గెట్ చేసిందని చెప్పారు. గురువారం నుంచి 30 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించేందుకు సంబంధించిన డిక్రీని ఉక్రెయిన్ చట్టసభ్యులు ఆమోదించారు. దీంతో కర్ఫ్యూలు అమల్లోకి వచ్చాయి. ర్యాలీలు, పొలిటికల్ పార్టీలు, ఆర్గనైజేషన్ల మీద బ్యాన్ విధించారు. రష్యాకు ఎవరూ ప్రయాణం చేయొద్దని, అక్కడ ఉన్న వాళ్లు వెంటనే వెనక్కి వచ్చేయాలని సూచించారు. ‘‘చాలా రోజులుగా ఎమర్జెన్సీ విధించకుండా ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది” అని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్ కౌన్సిల్ హెడ్ ఒలెక్సీ దానిలోవ్ చెప్పారు.

అమెరికా అటు.. చైనా ఇటు..
అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ వైపు నిలవగా.. చైనా, పాక్ రష్యా వైపు నిలిచాయి. ఇండియా మాత్రం తటస్థంగా ఉంటున్నట్లు ప్రకటించింది. అమెరికాతోపాటు, యూరప్, ఆసియా దేశాలు ఆంక్షలు విధిస్తామని ప్రకటించినా.. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, తమ మిలటరీలను పంపబోమని స్పష్టంచేశాయి. బాల్టిక్ దేశాలకు తమ బలగాలను అమెరికా పంపింది. అయితే ఆ దళాలను రష్యాతో పోరాడేందుకు పంపబోమని స్పష్టం చేసింది.

పుతిన్‌‌ను అడ్డుకోండి: ఉక్రెయిన్
రష్యా చేపట్టిన దాడి.. పూర్తి స్థాయి దండయాత్ర అని ఉక్రెయిన్ ఫారిన్ మినిస్టర్ దిమిత్రో కులేబా చెప్పారు. తమ దేశాన్ని తాము కాపాడుకుంటామని, తాము గెలుస్తామని ధీమావ్యక్తం చేశారు. ప్రపంచదేశాలు పుతిన్‌‌ను ఆపగలవని, ఆపాలని కోరారు. చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. తమ దేశంపై రష్యా చేసిన దాడుల్లో 40 మందికి పైగా చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని జెలెన్‌‌స్కీ అడ్వైజర్ ఒలెస్కీ అరెస్టోవిచ్ తెలిపారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు ప్రాంతాల నుంచి రష్యా దాడులు మొదలుపెట్టిందని మరో అడ్వైజర్ మిఖైలో పొడోలియక్ చెప్పారు.

ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..
బాంబుల మోతతో ఉక్రెయిన్ ప్రధాన నగరాలు ఉలిక్కిపడ్డాయి. మిలటరీ బేస్‌‌లపైనే కాకుండా.. రెసిడెన్షియల్ బిల్డింగ్స్‌‌పైనా బాంబులు పడ్డాయి. దీంతో చాలా బిల్డింగ్స్ ధ్వంసమయ్యాయి. ప్రజలు  ఏమవుతున్నదో అర్థం కాక వీధుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. రాజధాని కీవ్‌‌లో సైరన్లు మోగాయి. పరిస్థితి అర్థమయ్యాక.. సిటీ నుంచి బయటపడేందుకు జనం ప్రయత్నించారు. బస్సులు, కార్లలో, కొందరు నడుచుకుంటూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో కీవ్‌‌లో ఫుల్ ట్రాఫిక్ జాం అయింది. పెట్రోల్, గ్యాస్ కోసం కార్లు బారులుతీరాయి. చాలా మంది రైల్వే స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు.

జోక్యం చేసుకున్నారో..: పుతిన్
ఉక్రెయిన్‌‌కు, తమకు మధ్య జరుగుతున్న గొడవలో జోక్యం చేసుకోవద్దని ఇతర దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఉక్రెయిన్‌‌పై మిలటరీ ఆపరేషన్‌‌ చేపట్టనున్నట్లు టీవీలో ప్రకటించారు. తమ దేశంపై ఏదైనా దాడి జరిగితే.. అది విధ్వంసానికి, భయంకరమైన పర్యవసానాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. తూర్పు ఉక్రెయిన్‌‌లో ఉన్న పౌరులను కాపాడుకునేందుకు ఈ దాడులు చేయాల్సి వచ్చిందని అన్నారు. సెక్యూరిటీ గ్యారంటీలు, నాటోలో ఉక్రెయిన్ చేరకుండా చేసే విషయంలో రష్యా డిమాండ్లను అమెరికా, దాని మిత్రపక్షాలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఉక్రెయిన్‌‌ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, అయితే అక్కడ డీమిలటరైజ్ చేస్తామని, నేరాలు చేసిన వాళ్లను న్యాయం ముందు నిలబెడుతామని చెప్పారు. అక్కడి సైనికులు వెంటనే ఆయుధాలు వదిలిపెట్టి, ఇండ్లకు వెళ్లాలని సూచించారు.

ప్రజలకు ఆయుధాలిస్తం
రష్యా నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు ముందుకు వచ్చే ప్రజలకు ఆయుధాలిస్తామని ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ జెలెన్​స్కీ ప్రకటించారు. ఇలాంటి సమయంలో దేశాన్ని, తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇందుకోసం సహకరించాలని ఉక్రెయిన్​ ప్రజలను ఆయన గురువారం ఓ వీడియో సందేశంలో కోరారు. ‘‘మా గొంతుకను వినండి.. మాకు యుద్ధం ఇష్టం లేదు. శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. శాంతి స్థాపనకు మేం సర్వశక్తులు ఒడ్డుతున్నం” అని ప్రపంచ దేశాలకు తెలిపారు. ‘‘యుద్ధాన్ని మేం ఏమాత్రం ఎంకరేజ్​ చేయం. కానీ, శత్రువులు మా నుంచి మా దేశాన్ని దూరం చేయాలని చూస్తే, మా పిల్లలను మాకు కాకుండా చేయాలనుకుంటే, మా జీవితాలను నాశనం చేయాలని చూస్తే తప్పకుండా ప్రతిఘటిస్తాం. దాడిని తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.

నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ ప్రాజెక్టు క్లోజ్!
ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యాపై నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు విషయంలోనూ ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ బుధవారం ప్రకటించారు. రష్యా నుంచి జర్మనీకి నేరుగా బాల్టిక్ సముద్రం ద్వారా నేచురల్ గ్యాస్ ను సప్లై చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా, ఇంకా వినియోగంలోకి రాలేదు. అయితే, రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఈ ప్రాజెక్టును నిలిపేస్తున్నామని జర్మనీ మంగళవారమే ప్రకటించింది. దీంతో తాము కూడా ఈ ప్రాజెక్టుపై ఆంక్షలు విధిస్తున్నట్లు బైడెన్ వెల్లడించారు. మరోవైపు నార్డ్ స్ట్రీమ్ 2 ప్రాజెక్టును అడ్డుకుంటే.. యూరప్ లో ఇంధన మార్కెట్ పై ఒత్తిడి పడేలా రష్యా గ్యాస్ సప్లైని ఆపేయొచ్చని, దీంతో యూరప్ కంట్రీస్ తో పాటు అమెరికాలోనూ ఫ్యూయెల్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.