
మెదక్ (నిజాంపేట): పొలం విషయంలో కొడుకు వేధింపులు భరించలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధి తిప్పనగుళ్ల గ్రామంలో జరిగింది. నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట నర్సయ్య(65) తన పేరు మీద ఉన్న 2 ఎకరాల 10 గుంటల భూమిలో పెద్ద కొడుకు నర్సింలు భార్య సంపూర్ణ పేరుపై 20 గుంటల భూమిని పట్టా చేయించాడు. ఈ క్రమంలోనే చిన్న కొడుకు శ్రీనివాస్ తన తండ్రితో మాట్లాడి తన భార్య పేరు మీద ఒక ఎకరా 28 గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడు. అప్పటి నుండి పెద్ద కోడలు, పెద్ద కొడుకు ఇద్దరూ నర్సయ్యను వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన నర్సయ్య మంగళవారం పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.