కోటి దాటిన హైదరాబాద్ జనాభా..ప్రస్తుతం ఎంతంటే

కోటి దాటిన హైదరాబాద్ జనాభా..ప్రస్తుతం ఎంతంటే

భాగ్యనగరం..అన్ని మతాలకు అతిథ్యం ఇచ్చే నగరం. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల వారు జీవిస్తుంటారు. అందుకే హైదరాబాద్ను మినీ ఇండియా అంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జనాభా 1.05 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరనుందని పేర్కొంది. 

రాష్ట్ర జనాభాలో మూడో వంతు..

భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 నగరాలలో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలవగా.. ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచింది.  పట్టణీకరణ పెరగడంతో తెలంగాణ  జనాభాలో మూడోవంతు హైదరాబాద్ లోని నివసిస్తుంది. 

అప్పుడు ఎంత జనాభా..

1950లో  హైదరాబాద్‌ జనాభా 10 లక్షలు. ఆ తర్వాత1975 నాటికి 20 లక్షలకు పైగా జనాభా ఉంది. 1990లో  40 లక్షలకుపైగా చేరింది. 2010 నాటికి హైదరాబాద్ జనాభా 80 లక్షలకు పెరిగింది. గతంలో  ఒకప్పుడు హైదరాబాద్‌ అంటే ఎంసీహెచ్‌ పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే. జీహెచ్‌ఎంసీ ఏర్పాటుతో 650 చదరపు కిలో మీటర్ల పరిధికి విస్తరించింది. అవుటర్‌ రింగ్‌రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. ప్రతీ ఏడాది 5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ కు వలస వస్తున్నారు. 

1591లో హైదరాబాద్ ను  ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. 1956 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాద్.. 2014 నుంచి హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభాలో 64.93 శాతం హిందువులు, 30.13 శాతం ముస్లింలు, 2.75 శాతం క్రైస్తవులు, 2.19 శాతం ఇతర మతాలకు చెందినవారు ఉన్నారు.  కోటికి పైగా ఉన్న హైదరాబాద్‌ జనాభాలో 14 ఏళ్లలోపు పిల్లలు 25 శాతం వరకు ఉన్నారు. 60 శాతం పైగా జనాభా 15 నుంచి 64 ఏళ్ల మధ్యలోని వారే కావడం విశేషం.