వీధి కుక్క కరిచి.. చనిపోయిన ఎనిమిదేళ్ల బాలిక

 వీధి కుక్క కరిచి.. చనిపోయిన ఎనిమిదేళ్ల బాలిక

 వీధి కుక్కలను తప్పించుకునే ప్రయత్నంలో తలకు గాయమై ప్రాణాలు కోల్పోయిన టీ బ్రాండ్ వాఘ్ బక్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఘటన మరువక ముందే మరొక చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసింది. 

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన 8 ఏళ్ల బాలిక వీధికుక్కల దాడితో సరైన వైద్యం అందక మరణించింది. దుకాణానికి వెళుతుండగా కుక్క కాటుకు గురైన బాలికకు ఘటన జరిగిన తర్వాత యాంటి రేబిస్ వ్యాక్సిన్ వేయలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు చిన్నారి మరణించినట్లు ప్రకటించారు. అటువంటి దాడులు జరిగిన వెంటనే వ్యాక్సిన్‌ను వేయడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. . 

రెండు వారాల క్రితం ఆగ్రా జిల్లాలోని బాహ్ బ్లాక్‌లో వీధికుక్కలు 8 ఏళ్ల బాలికపై దాడి చేసి కరిచాయి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేసింది. దగ్గరలోని వైద్యుని వద్దకు తీసుకు వెళ్లినా....  రేబిస్ వ్యాక్సిన్ ఇప్పించడంలో అశ్రద్ధ చేశారు. ఫలితంగా ఆమె ఆదివారం (అక్టోబర్ 22) ప్రాణాలు కోల్పోయింది. కుక్కలు దాడి చేసిన వెంటనే చిన్నారికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఎఆర్‌వి) ఇవ్వలేదని వైద్యులు  తెలిపారు.  ఆమె పరిస్థితి క్షీణించడంతో, ఆమెను బహ్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు వారు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆమెను ఆగ్రాలోని ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చిన్నారి చనిపోయినట్లు ప్రకటించారు.