నీ వల్లే రోజుకు రూ.19 వందల కోట్ల ఖర్చు: యుద్ధంపై ట్రంప్ను గట్టిగానే అర్సుకున్నసెనేటర్

నీ వల్లే రోజుకు రూ.19 వందల కోట్ల ఖర్చు: యుద్ధంపై ట్రంప్ను గట్టిగానే అర్సుకున్నసెనేటర్

ట్రంప్ ఇరాన్ ను తక్కువ అంచనా వేశారా..? ముందస్తు ప్లానింగ్ లేకుండా యుద్ధానికి దిగారా..? ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాగే ఇరాన్ ను సింపుల్ గా క్లోజ్ చేయొచ్చనుకున్నారా..? ప్రపంచ దేశాలతో పాటు సొంత దేశం అమెరికాలో కూడా వస్తున్న ప్రశ్నలు ఇవి. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ను నమ్ముకుని అన్ని శక్తులు కూడగట్టుకుని యుద్ధానికి దిగిన అమెరికాకు.. ఇక మా వల్ల కావటం లేదురా బాబోయ్ అంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి. 5 రోజులు, కాదు కాదు 10 రోజుల విరామం అంటూ యుద్ధానికి విరామం చెప్పిన ట్రంప్.. ఇరాన్ కు ఛాన్స్ ఇస్తున్నం.. ఒప్పందానికి రాకుంటే రెట్టింపు వేగంతో ఇరాన్ ను మట్టుబెడతాం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని స్వదేశంలోనే విమర్శలు వస్తున్నాయి. 

లేటెస్టుగా యూఎస్ సెనేటర్ క్రిస్ ముర్ఫీ.. ప్రసిడెంట్ ట్రంప్ పై చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. మీ వల్లే అమెరికా రోజుకు 19 వందల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది తలకు మించిన భారంలా మారింది అంటూ ముర్ఫీ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. యుద్ధానికి ముందు హార్మూజ్ జలసంధి ఓపెన్ చేసి ఉంది. ఇప్పుడు అక్కడ రిస్ట్రిక్షన్స్ తో పాటు టోల్ వసూలు చేస్తున్నారు. ఇది మనకై మనం తెచ్చుకున్న పరిస్థితి. ట్రంప్ చేసిన తప్పుతో అమెరికా సైనికులు చనిపోయారు.. భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

రోజుకు రెండు బిలియన్  డాలర్లు అంటే చాలా పెద్ద ఖర్చు. ఇది యుద్ధం కోసం రోజుకు చేసిన మినిమం స్పెండింగ్.. ఇది అమెరికా స్వయంకృతాపరాధం అంటూ విమర్శలకు దిగారు. 

నౌకలపై టోల్ వసూలు:

హార్మూజ్ జలసంధి గుండా ప్రవహించే నౌకల నుంచి రెండు మిలియన్ డాలర్లు అంటే సుమారు 18.8 కోట్ల రూపాయల టోల్ చార్జీలను వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. టోల్ చెల్లించే నౌకలనే జలసంధి నుంచి వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పేర్కొంది. ఇది ఇప్పటికే అమలులోకి తెచ్చినట్లు ఇరాన్ ఎంపీ అలాయిద్దిన్ బొరౌజెర్దీ ఇరాన్ అధికారిక మీడియా IRIB తో పేర్కొన్నారు. 

దశాబ్దాలుగా జలసంధి తమ ఆధీనంలో ఉందని.. ఒక సార్వభౌమ దేశంగా టోల్ వసూల్ చేసే హక్తు తమకుందని బొరౌజెర్దీ చెప్పారు. దీంతో ఇరాన్ ఆర్థికంగా మరింత బలపడుతుందన్నారు. యుద్ధ కారణంగా మేము చార్జీలను వసూళ్లు చేయక తప్పడం లేదని అన్నారు.