సింగపూర్ లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ టూర్

సింగపూర్ లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ టూర్

సింగపూర్‌: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ ఆసియా పర్యటనను ఆదివారం ప్రారంభించారు. తన పర్యటనలో భాగంగా సింగపూర్‌, వియత్నాంల దేశాలను ఆమె సందర్శించనున్నారు. ఇవాళ సింగపూర్‌ చేరుకున్న వెంటనే ఆమె ఆ దేశ ప్రధాని, అధ్యక్షులతో సమావేశమవుతారు. అనంతరం యుఎస్‌ఎస్‌ తుల్సాలో అమెరికా నావికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  కమలా హారిస్ చేస్తున్న ఈ పర్యటన తమ దేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా ప్రయోజనం కలిగించనునందని వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించారు. 
సింగపూర్ అనంతరం వియత్నాంలో కమలా హారిస్ మంగళవారం చేరుకుంటారు. వియత్నాంను సందర్శించిన మొదటి అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ చరిత్ర సృష్టించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను  గతవారం తాలిబన్‌లు ఆక్రమించుకోవడంతో.. వేలాది మంది ఆఫ్ఘనిస్తానీలతోపాటు ఆ దేశంలో ఉద్యోగం, ఉపాధి పొందుతున్న వేలాది మంది ప్రాణాలు అరచేతపట్టుకుని దేశాన్ని విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘన్ లో  అమెరికా దళాల ఉపసంహరణ వల్లే  కారణంగానే తాలిబన్‌లు సునాయసంగా ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకునేందుకు అవకాశం కలిగిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం బహిరంగ రహస్య. 
ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని కాపాడే విషయంలో అమెరికా పూర్తిగా చేతులెత్తేయడం తీవ్ర విమర్శలకు గురవుతున్న నేపధ్యంలో  ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ ఆసియా దేశాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా విశ్వసనీయతపై అనుమానాలు, ఆందోళనలను పెరుగుతున్న క్రమంలో కమలాహారిస్ పరిస్థితిని కంట్రోల్ చేసే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇందులోభాగంగానే ఆమె సింగపూర్, వియత్నాం దేశాల్లో పర్యటించడం ద్వారా అమెరికాకు నిబద్దత ఉందనడానికి నిదర్శనమని అమెరికా వైట్ హౌస్ అధికారులు పేర్కొంటున్నారు.