కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు

కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు
  • లాంఛనంగా ప్రారంభించి పేరు ప్రకటించిన సీఎం జగన్ 

కర్నూలు: ననగరానికి 50 కిలోమీటర్ల దూరంలో  ఓర్వకల్లు పరిధిలో నిర్మించిన కొత్త ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఈనెల 28 నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్న కర్నూలు ఎయిర్ పోర్టును కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో కలసి సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.తొలుత ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్ వద్ద దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ను రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎయిర్ పోర్టుప్రారంభిస్తున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్‌ జారీ చేయగా.. బీసీఏఎస్‌ సెక్యూర్టీ క్లియరెన్స్‌ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.
రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళి-జగన్
రాయలసీమ ముఖద్వార ప్రజల చిరకాల వాంఛనె నెరవేర్చిన సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. రేనాటి వీరుడు.. ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళిగా ఎయిర్ పోర్టుకు ఆయన పేరు పెడుతున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేరోజు.. న్యాయ రాజధాని అయిన కర్నూలుతో ఇతర ప్రాంతాలకు విమానయానం ప్రజలకు అందుబాటులో వచ్చింది. గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేది..ఇక నుండి విమానాల ప్రయాణం కూడా జరగబోతోంది.. రాష్ట్రంలో ఇది 6వ విమానాశ్రయం..అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రూ.110 కోట్లు ఖర్చుపెట్టి ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశామన్నారు. 2019 ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చంద్రబాబు ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారు., విమానాలు ఎగరని పరిస్థితులు.. కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రిబ్బన్ కట్ చేశారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ పి.అనిల్ కుమార్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు, నంద్యాల,హిందూపురం ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డాక్టర్ జె.సుధాకర్, బిజేంద్రనాథ్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కంగాటి శ్రీదేవి, బాల నాగిరెడ్డి, రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆర్థర్, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూల్ మున్సిపల్ కమిషనర్ డి.కె బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు గర్వకారణం
రాయలసీమ ముఖద్వారం ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం ఒక ఎత్తయితే.. బ్రిటీష్ వారిపై తిరుగుబాటుకు శ్రీకారం చుట్టిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును కర్నూలు ఎయిర్ పోర్టుకు పెట్టడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. ఈ గడ్డపై కాలుమోపే వారికి ఆయన చరిత్ర తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగేలా ఎయిర్ పోర్టుకు నామకరణం చేసిన సీఎం జగన్ కు సామాజిక సేవకు స్ఫూర్తి దాత, ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ భాస్కర్ రెడ్డి, అద్దె బస్సుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాటిల్ హనుమంతరెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభిస్తున్న విషయం తెలిసిన వెంటనే తాము స్థానిక పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని సంప్రదించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ప్రతిపాదించామన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలందరి నుండి సానుకూల లేఖలు తీసుకుని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ద్వారా సీఎం జగన్ కు అందజేయగా ఆయన వెంటనే ఆమోదించి ప్రజల సమక్షంలోనే పేరు ప్రకటించారని డాక్టర్ భాస్కర్ రెడ్డి వివరించారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కృషి చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సభాముఖంగానే ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు.