- తుఫాన్లు, ఎడతెరిపిలేని వానలతో పెరిగిన ధరలు
- భద్రాద్రికొత్త గూడెం జిల్లాలో అంతంతమాత్రంగానే సాగు
- 23 మండలాల్లో 843 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు
- భిన్నమైన వాతావరణంతో మరిన్ని ఇబ్బందులు
భద్రాచలం, వెలుగు : జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. తుఫాన్లు, ఎడతెరిపిలేని వానలు, దీనికితోడు జిల్లాలో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉండటంతో కొరత తీవ్రంగా ఏర్పడింది. ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగాయి. పక్క రాష్ట్రంపై కూరగాయలకు ఆధారపడటం, అక్కడ మొంథా తుఫాన్ కారణంగా కూరగాయల పంటలు పాడైపోవడం ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ఇప్పుడు సాగు చేసిన పంటలు చేతికొచ్చేవరకు ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో జిల్లాలో కూరగాయలకు డిమాండ్ పెరిగింది.
భిన్నమైన వాతావరణం..
ఈ ఏడాది జిల్లాలో భిన్నమైన వాతావరణం నెలకొంది. దసరాలోపే సాధారణంగా వర్షాలు ఆగిపోతాయి. కానీ వరుసగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వల్ల ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నవంబర్ వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది. దీంతో జిల్లాలోని మారుమూల గ్రామాల్లో సాగు చేసే కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. తెగుళ్లుసోకి, దిగుబడి రాక, కొన్ని చోట్ల కుళ్లిపోయాయి. ఇక ఏపీలోని తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, విజయవాడ, గుంటూరు మార్కెట్ల నుంచి ఎక్కువగా కూరగాయలు జిల్లాకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో మొంథా తుఫాన్ కారణంగా ప్రస్తుతం కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
స్థానికంగా కూరగాయల సాగు తక్కువే..
జిల్లాలో కూరగాయల సాగుకు రైతులు మొగ్గు చూపడం లేదు. ప్రభుత్వం రాయితీలు కల్పించి విత్తనాలు ఇస్తున్నా సాగు చేయడానికి జిల్లాలో ముందుకు రావడం లేదు. ఒక రోజు ఒక మనిషికి 200 గ్రాముల కూరగాయల అవసరం ఉంటుంది. కార్తీకమాసంతో పాటు అయ్యప్పస్వాముల దీక్షల కారణంగా డిమాండ్ ఇంకా పెరిగింది. జిల్లాలోని 23 మండలాల్లో కేవలం 705 మంది రైతులు మాత్రమే 843.17 ఎకరాల్లో కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు.
ఇంత తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వల్లనే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుజాతనగర్లో మాత్రమే అధికంగా 344.15 ఎకరాల్లో సాగవుతుండగా, ములకలపల్లి, భద్రాచలం, చుంచుపల్లి, ఆళ్లపల్లి, బూర్గంపాడు, పినపాక మండలాల్లో కనీసం మూడెకరాల్లో కూడా సాగు చేయడం లేదు. అవకాశాలు ఉన్నా రైతులు పత్తి, మిరప లాంటి వాణిజ్య పంటల వైపే చూస్తుండటం కూడా ప్రధాన కారణం. జిల్లాలోని పలు మండలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. వేసిన పంటలను అవి ధ్వంసం చేస్తున్నాయి. ఆ కారణంతోనే కూరగాయల సాగు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు.
వానల ప్రభావంతోనే ఎక్కువ..
సాధారణంగా ఈ సీజన్లో కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో మార్కెట్లోకి కూరగాలయలు తక్కువగా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఎక్కువగా తాడేపల్లిగూడెం, గుంటూరు, విజయవాడ, జంగారెడ్డిగూడెం మార్కెట్లపై ఆధారపడుతున్నాం. అక్కడ తుఫాన్ కారణంగా పంటలు పాడయ్యాయి. దీంతో రోజువాడే కూరగాయల ధరలే ఎక్కువగా పెరిగాయి. - పసుపులేటి శ్రీనివాసరావు, కూరగాయల వ్యాపారి, భద్రాచలం
ధరలు ఇలా.. కూరగాయ
(కిలో) గత నెల ధర(రూ.ల్లో) ప్రస్తుత ధర(రూ.ల్లో)
బెండకాయ 40 80
వంకాయ 40 80
టమాట 30 40
దొండకాయ 40 60
బీరకాయ 40 60
క్యారట్ 60 100
