ఇబ్రహీంపట్నం, వెలుగు: ముప్పై ఏండ్ల క్రితం తమకు పునరావాసం కింద ఇచ్చిన భూమిని వేరేవారికి అప్పజెప్పారని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో ముంపు బాధితులు ఆందోళన చేశారు. ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండిలో గోదావరి తీరం పరిశీలనకు గురువారం వచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తిరిగి వెళ్తుండగా కాన్వాయ్‌ను ముంపు బాధితులు, గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎర్ధండిలో గోదావరికి వరదలు వచ్చినప్పుడు తలదాచుకోవడానికి పునరావాసం కింద గ్రామ శివారులోని సర్వే నం.104 లో 70 ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయించి పలువురికి పట్టాలు ఇచ్చిందని, వరదలు వచ్చినప్పుడల్లా చాలాసార్లు ఆయా స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఉన్నామని బాధితులు చెప్పారు. కానీ ఈ మధ్యలో ఓ వ్యక్తికి ఆ భూమికి సంబంధించి ప్రభుత్వంపట్టా ఇచ్చిందని, అందులో తాము వేసుకున్న గుడిసెలను తొలగించి పంటలను సాగు చేయనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పుడు ఎక్కడో ఉండాలో తెలియడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు మీకు విన్నవించిన పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో హామీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదంటూ ఎమ్మెల్యే వెహికల్‌కు అడ్డుగా నిలబడి నినాదాలు చేశారు. సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పినా బాధితులు వినకపోవడంతో పోలీస్ బందోబస్తు నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టారు.
