
సినీనటి, బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఖర్గే విజయశాంతిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో విజయశాంతి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నవంబర్ 15న బీజేపీ బైబై చెప్పిన విజయశాంతి ఈరోజు ( నవంబర్ 17)న కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారేది లేదని చెప్పిన రెండు రోజులకు ఆమె పార్టీ మారారు.
గతంలో కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలోకి వెళ్లారు. కానీ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ సభలకు కూడా హాజరు కావడం లేదు. అప్పటి నుంచే కొన్ని అనుమానాలు తలెత్తాయి. అయితే బీజేపీ, జనసేన పొత్తు కారణంగా ఆమె బీజేపీకి మొన్న బుధవారం రాజీనామా చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
పార్టీ తీరుపై అసహనంగా ఉన్న రాములమ్మ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. . కొన్నాళ్లుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ కమలం పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.
కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్‌కే ఉందని నమ్మిన విజయశాంతి హస్తం గూటికి చేరే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ( నవంబర్ 17) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా.. బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నవిజయశాంతికి కాంగ్రెస్ గాలం వేసింది. మెదక్ ఎంపీ సీటుతోపాటు సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇస్తూ జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇవాళ ( నవంబర్ 17)హస్తం గూటికి చేరుకున్నారు రాములమ్మ.