- తీవ్ర గాయాలతో బయటపడ్డ కుమారుడు
- వికారాబాద్ జిల్లా తట్టెపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
తాండూరు, వెలుగు: స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. జహీరాబాద్‌కు చెందిన కవిరాజ్ (40) తన భార్య పావని(35), కొడుకు కార్తీక్(13), కూతురు కీర్తన(11)తో కలిసి ఆదివారం అత్తగారి ఊరైన పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌కు వచ్చారు. సోమవారం రుక్మాపూర్ నుంచి కవిరాజ్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జహీరాబాద్‌కు స్కూటీపై బయల్దేరారు. తట్టెపల్లి సమీపంలోకి రాగానే జహీరాబాద్ వైపు నుంచి తాండూరుకు వెళ్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న స్కూటీని వేగంగా ఢీకొట్టింది.
దీంతో స్కూటీపై ఉన్న కవిరాజ్, ఆయన భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు పెద్దేముల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు కార్తీక్‌ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.

