బెంగళూరులో బైకర్‌ని చెంపదెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్.. దెబ్బకు సస్పెండ్..

 బెంగళూరులో బైకర్‌ని చెంపదెబ్బ  కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. వీడియో వైరల్..  దెబ్బకు సస్పెండ్..

బెంగళూరులో ఒక ట్రాఫిక్ పోలీస్ రోడ్డుపై ఓ బైకర్ తో వాదిస్తూ చెంపదెబ్బ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ మారడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 

వివరాలు చూస్తే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ చిన్న వీడియో క్లిప్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్, బైకర్  మొదట కోపంగా వాదించుకుంటూ కనిపిస్తుంది. తర్వాత అందరూ చూస్తుండగానే ట్రాఫిక్ పోలీస్  ఒక్కసారిగా బైకర్‌ను చెంపదెబ్బ కొడతాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేది  వివరాలు తెలియకపోగా...  పోలీసుల గురించి ప్రజల్లో చర్చ  మొదలైంది.  

ట్రాఫిక్ పోలీసులకు వాహనాలను ఆపడానికి, రూల్స్ ఉల్లంఘన పై జరిమానా విధించడానికి అధికారం ఉంటుంది. కానీ ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే తప్ప కొట్టడానికి హక్కు లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ పై నెటిజన్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

 కొందరు సోషల్ మీడియా యూజర్లు బెంగళూరు సిటీ పోలీస్ & ట్రాఫిక్ ని ట్యాగ్ చేస్తూ, దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని, కర్ణాటకలో పోలీస్ పనితీరు నిరూపించుకోండి అంటూ కోరుతూ పోస్ట్ చేసారు. మరొకరు ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టండి, ఆ పోలీసు అధికారిపై కేసు పెట్టి పరిహారం ఇప్పించడానికి సహాయం చేస్తాను అని అనగా... ఇంకో యూజర్ ఆ పోలీసుపై ఏం చర్య తీసుకున్నారు ? చెప్పాలి.. అని డిమాండ్ చేశారు.

ఇలాంటి  ఘటనలు పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నాయని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తుండగా... ఇలాంటి పనులు మొత్తం పోలీస్ శాఖకు చెడ్డ పేరు తెస్తాయి అని కామెంట్ పెట్టారు. పోలీస్ ఉన్నత అధికారులు ఈ వీడియోను చూసి వెంటనే ఆ ట్రాఫిక్ పోలీస్ పై చర్యలు తీసుకున్నారు.

 బాధ్యత, గౌరవం ఒకదానికొకటి ముఖ్యమైనవి. దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు అని బెంగళూరు సిటీ ట్రాఫిక్ సౌత్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  X (ట్విట్టర్) అకౌంట్లో పోస్ట్ చేశారు. అలాగే ఆ ట్రాఫిక్ పోలీస్ ని సస్పెండ్ చేసినట్లు కూడా  తెలిపారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తించడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందు కూడా పోలీసులు కోపంగా వాదించడం,  చెయ్యి చేసువడం వంటి వీడియోలు ఇంకా ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.