ప్రజల మనస్సు గెలిస్తేనే ఓట్లు పడ్తయ్

ప్రజల మనస్సు గెలిస్తేనే ఓట్లు పడ్తయ్
  • అబద్దాలకు ఓట్లు పడవు
  • హుజురాబాద్ ధూం దాం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు 

కరీంనగర్: అబద్దాలకు ఓట్లు పడవు.. ఢిల్లీలో బలముందని పోలీస్ బలగాలను దించుతా అన్నా.. ఓట్లు పడవు..  ప్రజల మనస్సు గెలిస్తే ఓట్లు పడ్తయ్.. అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హుజూరాబాద్ లో ధూందాం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ప్రజలకు ఏం చేస్తావ్ అనేది చెప్పావ్ కానీ, తిట్ల పురాణం మొదలు పెడుతున్నావని ఈటలను విమర్శించారు. ఇక్కడ బీజేపీ మనుషులు, మహబూబ్ నగర్ నుండి వచ్చి చెబితే నమ్మరు అని ఆయన పేర్కొన్నారు. 
గ్యాస్ సిలిండర్ ధర తగ్గాలంటే గెల్లు శ్రీనుకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు. హుజురాబాద్ లో గెలిచేది గెల్లు శ్రీను.. కారు గుర్తేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే హుజురాబాద్   ప్రజలకు లాభం.. ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం అన్నారు. హుజురాబాద్ పట్టణంలో 60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని,  కేంద్రమంత్రులు వట్టి  చేతులతో వస్తున్నారు తప్ప హుజురాబాద్ నియోజకవర్గనికి చేసింది ఏమీలేదని విమర్శించారు. బీజేపీ పార్టీ నాయకులు గ్యాస్ ,పెట్రోల్, డీజిల్  ధరలు తగ్గిస్తాం అని చెప్పి  ఓట్లు అడగాలని ఆయన సూచించారు.  గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే  15 రోజులకు ఒకసారి హుజురాబాద్ కు వస్తామని..  అభివృద్ధిని కొనసాగిస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇవ్వండి.. ఈ హుజురాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చి చూపుతామన్నారు.  ప్రభుత్వ  సంస్థలను   అమ్ముతున్న  ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో  సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.