Suresh Babu : బాలయ్య 'అఖండ 2' కోసం ఎదురుచూస్తున్నాం.. -వాయిదాపై సురేశ్ బాబు కీలక వ్యాఖ్యలు!

Suresh Babu : బాలయ్య 'అఖండ 2' కోసం ఎదురుచూస్తున్నాం.. -వాయిదాపై సురేశ్ బాబు కీలక వ్యాఖ్యలు!

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకులు బోయపాటి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం 'అఖండ 2 తాండవం'. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది.. కానీ చివరి నిమిషంలో నిలిచిపోవడంతో అందరిని షాక్ కు గురిచేసింది.  మరో రెండు మూడు గంటల్లో బొమ్మ రెడీ అనుకుంటున్న సమయంలో నిర్మాణ సంస్థ సినిమాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో లక్షలాది మంది అభిమానులకు నిరాశను మిగిల్చింది. కొందరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

 ఈ నేపథ్యంలో, సినిమా వాయిదాపై అనేక ఊహాగానాలు, నిరాధారమైన కథనాలు వైరల్ అవుతున్నాయి. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఈ చిత్రం విడుదల నిలిచిపోయిందని టాక్ వినిస్తోంది. లేటెస్ట్ గా 'అఖండ 2' మూవీ వాయిదాపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేశ్ బాబు స్పందించారు. శ్రీనందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ' పాట ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 'అఖండ 2' గురించి వస్తున్న తప్పుడు వార్తలు దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం..

'అఖండ 2' విడుదల అవుతుందని మేమంతా ఆశగా ఎదురుచూస్తున్నామని సురేశ్ బాబు తెలిపారు. ఆ సినిమా కోసం తెర వెనుక చాలా మంది సాంకేతిక నిపుణులు, నటీనటులు ఎంతో కష్టపడ్డారు. గతంలో కూడా చాలా సినిమాలకు ఇలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతి సినిమా విషయంలో కొన్ని ఆర్థికపరమైన చిక్కులు ఉండటం సహజం. వాటిని ఎవరూ బయటకు వెల్లడించకూడదు అని చెప్పారు.. ఈ సమస్య పరిష్కారానికి తాను కూడా ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు. నేను కూడా ఈ ఉదయం నుంచి ఆ సమస్యను క్లియర్ చేద్దామని వెళ్లాను అని సురేశ్ బాబు వెల్లడించారు.

 నిరాధారమైన కథనాలపై ఆగ్రహం

సినిమా వాయిదా పడిన వెంటనే సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన ఊహాజనిత కథనాలపై సురేశ్ బాబు అసహనం వ్యక్తం చేశారు. కొందరు, వారికి నచ్చినట్లు కథనాలు రాసేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాల గురించి, కారణాల గురించి తమకు తోచినట్లుగా రాస్తున్నారు. 'అఖండ 2 వాయిదా పడటానికి ఇన్ని కోట్లు అటా.. అసలు కారణం ఇదే.. వంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు రావడం చాలా దురదృష్టకరం అని అన్నారు.

ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమై, తప్పకుండా మంచి వార్తే అందుతుందని సురేశ్ బాబు ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణ రంగంలో ఇలాంటి అడ్డంకులు సహజమని, త్వరలోనే నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడి, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని సినీ వర్గాలు, అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు.