వారసత్వ కట్టడాలపై కేంద్రం దృష్టి పెట్టాలి : ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వారసత్వ కట్టడాలపై కేంద్రం దృష్టి పెట్టాలి : ఎంపీ  డాక్టర్ కడియం కావ్య

హనుమకొండ, వెలుగు: వరంగల్ లోని కాకతీయుల చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలని  డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలను అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలు, మూడేళ్లుగా వాటికి కేటాయించిన నిధులు, ఆక్రమణలు, నిర్మాణ నష్టం నివారించేందుకు తీసుకుంటున్న చర్యలపై సోమవారం లోక్‌సభలో వరంగల్ ఎంపీ వివరణ కోరారు. దీంతో కేంద్ర టూరిజం, కల్చరల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ తెలంగాణలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మొత్తం ఎనిమిది కేంద్ర పరిరక్షిత స్మారక కట్టడాలు ఉన్నాయని, వాటిలో హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ కోట ఉన్నాయన్నారు. జాతీయ సంరక్షణ విధానానికి అనుగుణంగా ఈ కట్టడాల పరిరక్షణ, సంరక్షణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

తెలంగాణలో స్మారక కట్టడాల సంరక్షణకు 2022-–23లో రూ.15.50 కోట్లు, 2023-–24లో రూ.14.38 కోట్లు, 2024-–25లో రూ.6.80 కోట్లు కేటాయించగా రూ.6.77 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. హృదయ్ పథకం కింద వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేయగా, 2018లో వెయ్యి స్తంభాల గుడి వద్ద టైల్ పార్కింగ్, లైటింగ్ సదుపాయాలు కల్పించారని, 2022లో వరంగల్ కోట ఉత్తర ద్వారం, ఖుష్ మహల్, స్వయంభూ ఆలయ సముదాయం, కీర్తి తోరణం వద్ద ఫసాడ్ లైటింగ్ ఏర్పాటు చేశారని, వరంగల్ లోని స్మారక కట్టడాల కోసం నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ (ఎన్ఎంఎంఏ) కింద ప్రత్యేక పథకాలు ఏవీ ప్రతిపాదించలేదని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఎంపీ కావ్య స్పందిస్తూ వరంగల్ స్మారక కట్టడాల కోసం ప్రత్యేక కేంద్ర పథకాలు లేకపోవడం ఆందోళనకరమన్నారు. కాకతీయుల కాలంనాటి అమూల్య వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు కాపాడేందుకు, వరంగల్ పర్యాటకాభివృద్ధికి దోహదపడేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు.