ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల వల్ల గత మూడు వారాలుగా పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ముఖ్య నాయకులతో పాటు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, యుద్ధాన్ని ఆపడానికి ఇరాన్ రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మేము ఈ యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని అనుకుంటున్నాము అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి అన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. అయితే, దీనిపై ఇరాన్ ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
యుద్ధం గురించి అమెరికా చెబుతున్న మాటలు వాస్తవాలకు వేరేలా ఉన్నాయని అబ్బాస్ అరఘ్చి విమర్శించారు. గతంలో వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా ఎలాగైతే గొప్పలు చెప్పుకుందో, ఇప్పుడు కూడా అలాగే చేస్తోందని ఆయన అన్నారు.
అమెరికా యుద్ధ విమానం (F-35) అత్యవసరంగా ల్యాండ్ అవ్వడం, వారి యుద్ధ నౌకల కదలికలను బట్టి చూస్తే అమెరికా చెబుతున్నంత గొప్పగా ఎం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరి 28న మొదలైన ఈ దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400 మందికి పైగా మరణించారు. అటు అమెరికా సైన్యం కూడా సైనికులను నష్టపోయింది. యుద్ధాన్ని ఆపేయాలని మాటలు వినిపిస్తున్నప్పటికీ, నేరుగా శాంతి చర్చలు లేదా దాడులు ఆపడం వంటి అధికారిక చర్యలు ఇంకా మొదలుకాలేదు.
