50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తాం 

50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తాం 

అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తామని.. సమాన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు  వైఎస్ షర్మిల. హైదరాబాద్ లో YSR తెలంగాణ పార్టీని ఆవిష్కరించిన ఆమె..కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభాలో సగం ఉన్న మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు.

తమ పార్టీలో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ షర్మిల. చట్టసభల్లో 50 శాతం మహిళలు కూర్చోవాలనేది లక్ష్యమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బీసీలను అభివృద్ధికి దూరం పెడుతోందని..బడ్జెట్లో 3 శాతం నిధులు కేటాయిస్తే వాళ్లు ఎప్పుడు అభివృద్ధి చెందుతారని ప్రశ్నించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు.

 దళితులకు మూడెకరాలు ఇవ్వక పోగా..అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం గుంజుకుంటోందని విమర్శించారు. దళితులపై జరుగుతున్న దాడులను చూస్తూ కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారన్నారు. గిరిజనుల మానప్రాణాలపై ఆయనకు పట్టింపులేదన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతూ ఏడేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. YSR తెలంగాణ పార్టీ మైనార్టీలకు ఫైట్ బ్యాంక్ గా నిలుస్తుందని తెలిపారు షర్మిల. అంతేకాదు..ఉద్యమకారుల సంక్షేమం కోసం నిలబడుతామని.. స్వతంత్ర సమరయోధులను గుర్తించినట్లే తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామన్నారు. వారికి అన్ని సేవలను ఉచితంగా అందిస్తామని..దీని కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీని ప్రజల్లోకి తీస్కెళ్లడంతో పాటు బలోపేతం చేసేందుకు 100 రోజుల్లో పాదయాత్ర చేపడుతానని తెలిపారు వైఎస్ షర్మిల.