తొలిరోజే నిరాశ పరిచిన లెన్స్‌కార్ట్ ఐపీవో.. కొన్నోళ్లకు ఎంత లాస్ అంటే..?

తొలిరోజే నిరాశ పరిచిన లెన్స్‌కార్ట్ ఐపీవో.. కొన్నోళ్లకు ఎంత లాస్ అంటే..?

గడచిన కొద్ది రోజులుగా దేశీయ ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న లెన్స్‌కార్ట్ ఐపీవో నేడు స్టాక్ మార్కెట్‌లో బలహీనమైన లిస్టింగ్ నమోదు చేసింది. దీంతో లాభాలు వస్తాయనుకున్న పెట్టుబడిదారులకు చివరికి నష్టాలు మిగిలాయి. ప్రముఖ ఐవేర్ కంపెనీ లెన్స్‌కార్ట్ షేరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో తొలిరోజున ఒక్కో స్టాక్ రూ.395 వద్ద లిస్టయింది. ఇది వాస్తవ ఇష్యూ ధర రూ.402 తో పోల్చితే 1.74 శాతం తగ్గుదల. అదే సమయంలో బీఎస్ఈలో స్టాక్ మరింత తక్కువగా ఒక్కోటి రూ.390 వద్ద ప్రారంభమై 2.99 శాతం నష్టంతో ట్రేటింగ్ ప్రారంభించింది. 

 కంపెనీ ఒక్కో లాట్‌లో 37 షేర్లు ఉంచింది. దీంతో లెన్స్‌కార్ట్ ఐపీవోలో స్టాక్స్ అలాట్ అయిన పెట్టుబడిదారుల ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.14వేల 615కు పడిపోయింది. అంటే ప్రతి లాట్‌పై స్వల్ప నష్టం అందుకున్నారు. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.7వేల 278.02 కోట్లను మార్కెట్ల నుంచి రైజ్ చేసింది. ఇందులో రూ.2వేల 150 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలిన రూ.5వేల 128.02 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించింది. కంపెనీ వ్యవస్థాపకులతో పాటు, ఇన్వెస్టర్లు ఓఎఫ్ఎస్ లో పాల్గొంటున్నారు. 

ఐపీవోకి ముందు కంపెనీ రూ.3,268 కోట్ల విలువైన షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు విజయవంతంగా అమ్మింది. వీరిలో సింగపూర్ మానిటరీ అథారిటీ, సింగపూర్ ప్రభుత్వం, ఫిడెలిటీ, నోమురా, బ్లాక్‌రాక్, టి. రో ప్రైస్, గోల్డ్‌మన్ శాక్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, కోటక్ అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి.

అసలు కంపెనీ వ్యాపారం.. 

లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ టెక్-ఎనేబుల్డ్ ఐవేర్ స్టార్టప్ కంపెనీ. ఇది డిజైనింగ్, మాన్యుఫాక్చరింగ్, రిటైలింగ్ రంగాల్లో  కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో తాము రూపొందించిన కళ్లజోళ్లు, సన్‌గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్‌లు కస్టమర్లకు నేరుగా అమ్ముతూ "డైరెక్ట్-టు-కస్టమర్" (D2C) మోడల్‌లో వ్యాపారం చేస్తోంది.