లగ్జరీ వాచీలు, కర్ణాటక రాజకీయాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా కాలంగా సోషలిస్ట్ ఇమేజ్‌ను పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేతికి ఉన్న కాస్ట్లీ వాచ్ చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ బ్రేక్ ఫాస్ట్ మీటింగులో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ఇద్దరూ కార్టియర్ (Cartier) కంపెనీ వాచీలు ధరించి కనిపించారు. కానీ అందరి దృష్టి ముఖ్యమంత్రి వాచ్ పైనే పడింది.
ఈ వాచ్ శాంటోస్ డి కార్టియర్ (Santos de Cartier) వాచ్. ఇది పూర్తిగా సాలిడ్ రోజ్ గోల్డ్ తో తయారు చేసారు. దీని ధర అక్షరాలా రూ. 43 లక్షల 20 వేలు. భారత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో ఇదే కంపెనీకి చెందిన కార్టియర్ శాంటోస్ మోడల్ వాచ్ ధరించడం గమనార్హం. కానీ సిద్ధరామయ్య ధరించిన శాంటోస్ డి కార్టియర్ మోడల్ అత్యంత కాస్ట్లీ వాటిలో ఒకటి.
దీని డిజైన్ కేసు, చేతి పట్టీ రెండూ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ తో తయారు చేశారు. దీని డిజైన్‌లో పారిశ్రామిక రూపాన్ని చూపించేలా, పైకి కనిపించే స్క్రూలు ఉంటాయి. ఇది 1904 నాటి ఒరిజినల్ శాంటోస్ డిజైన్ లాగ ఉంటుంది.
ఈ వాచ్‌లో కార్టియర్ సంస్థ రూపొందించిన 1847 MC అనే సెల్ఫ్-వైండింగ్ మెకానికల్ సిస్టం ఉంది. ఇది గంటలు, నిమిషాలు, సెకన్లతో పాటు 6 గంటల స్థానంలో తేదీని కూడా చూపిస్తుంది. సిల్వర్ కోటింగ్ తో తెల్లగా ఉన్న డయల్‌పై నలుపు రంగు రోమన్ అంకెలు, నీలం రంగులో కత్తి ఆకారంలో ఉండే ముల్లులు ఉంటాయి.
ఈ వాచ్ సుమారు 39.8mm వెడల్పు, 9mm మందంతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వాచ్ వాటర్ రిసిస్టెంట్ కూడా అంటే ప్రతిరోజు వాడడానికి, నిరు పడ్డ కూడా చెడిపోదు. లూయిస్ కార్టియర్ ఈ వాచ్‌ను 1904 లో బ్రెజిలియన్ విమానయాన నిపుణుడు ఆల్బెర్టో శాంటోస్-డుమోంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇది పురుషుల కోసం తయారు చేసిన మొట్టమొదటి రిస్ట్ వాచ్‌లలో ఒకటిగా చెబుతారు.
సిద్ధరామయ్య వాచ్ విషయంలో వివాదంలో చిక్కుకోవడం ఇదేం మొదటిసారి కాదు. అప్పట్లో ఆయన ధరించిన హుబ్లోట్ వాచ్ రాజకీయ దుమారం రేపింది. దీని ధర సుమారు రూ. 50-70 లక్షల మధ్య ఉంటుందని చెబుతుంటారు. అప్పట్లో దీనిపై జోరుగా పెద్ద చర్చ కూడా సాగింది.
ఈ చర్చల పై సిద్ధరామయ్య స్పందిస్తూ... ఆ హుబ్లోట్ వాచ్ దుబాయ్‌లో ఉన్న తన NRI ఫ్రెండ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ గిరీష్ చంద్ర వర్మ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ గిఫ్ట్ అని, దాని అసలు విలువ తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
