
వాట్సాప్‌లో ‘గెస్ట్ చాట్’ అనే కొత్త ఫీచర్ త్వరలోనే రానుంది. సాధారణంగా ఎవరికైనా వాట్సాప్‌లో మెసేజ్ చేయాలంటే వాళ్ల కాంటాక్ట్ నెంబర్ ఫోన్లోనే ఉంటుంది. అయితే వాట్సాప్ వాడని వాళ్లకు మెసేజ్ చేయాలంటే ఎలా? ఇప్పటికైతే కుదరదు. కానీ, రాబోయే రోజుల్లో గెస్ట్ చాట్ ద్వారా మెసేజ్ పంపొచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే.. వాట్సాప్ లేని వాళ్లకు ఒక స్పెషల్ లింక్ పంపించాలి. వాళ్లు ఆ లింక్ పై క్లిక్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి చాట్ మొదలుపెట్టొచ్చు. అందుకోసం యాప్‌ను ఇన్స్టాల్ చేయడం, అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేనే లేదు.
ఇది వాట్సాప్ వెబ్ వంటి ఇంటర్ఫేస్ ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రాసెస్ ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. చాట్ అంటే టెక్స్ట్ మెసేజ్ మాత్రమే చేయగలరు. అంతేకానీ, ఎలాంటి మీడియా ఫైల్‌ను షేర్ చేయలేరు. గెస్ట్ చాట్‌లో ఫొటోలు, వీడియోలు, జిఫ్‌లు, వాయిస్ నోట్లు పంపలేరు. వాయిస్ లేదా వీడియో కాల్స్ కూడా చేయలేరు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.
వెయ్యిమంది ఫాలోవర్లుఉండాల్సిందేనా?
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేవాళ్లలో చాలామంది తమ ఫాలోవర్లతో లైవ్ బ్రాడ్ కాస్ట్ చేస్తుంటారు. మొన్నటివరకు అయితే ఫాలోవర్లు ఎంతమంది ఉన్నా లైవ్‌కి రావడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. కానీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూజర్లకు కొత్త రూల్ తీసుకొచ్చింది. కనీసం వెయ్యి మంది ఫాలోవర్లు లేకపోతే లైవ్ బ్రాడ్ కాస్ట్ చేయడం వీలు కాదని తేల్చిచెప్పేసింది. అంతేకాదు.. లైవ్ చేయాలంటే వాళ్ల అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలని చెప్పింది. దీంతో తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లు, కొత్త యూజర్లకు లైవ్‌లోకి వచ్చే చాన్స్ మిస్ అవుతుంది.
ఒక రిపోర్ట్ ప్రకారం.. ఈ రూల్ కూడా మన దేశంలోనే అమలవుతోందని తెలిసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లందరికీ వర్తిస్తుంది. అయితే చిన్న చిన్న బిజినెస్‌లు చేసేవాళ్లు, స్టార్టింగ్ స్టేజీలో ఉన్న కంటెంట్ క్రియేటర్లపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించే చాన్స్ ఉంది. రోజూ లైవ్ ద్వారా తమ ఫాలోవర్స్‌తో కనెక్ట్ అయ్యి ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్న చిన్న క్రియేటర్లకు ఇది మైనస్. దీంతో ఈ రూల్ తీసుకురావడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ రూల్ పెట్టడానికి గల కారణాలేంటో ఇప్పటికైతే క్లారిటీ రాలేదు.
యూజర్ ‘సేఫ్టీ’ కోసం..
స్టాక్ మార్కెట్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ వంటి గ్రూప్ మోసాల నుంచి యూజర్లకు సేఫ్టీ కల్పించాలనే ఉద్దేశంతో వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే ‘సేఫ్టీ ఓవర్ వ్యూ’. ఇది వాట్సాప్ గ్రూప్ స్కామ్‌ల్లో చిక్కుకోకుండా కాపాడుతుంది. అంతేకాదు.. గ్రూప్ గురించి ఇంపార్టెంట్ విషయాలను చేరవేయడం, ఫిషింగ్ వంటి ఇతర మెసేజింగ్ స్కామ్‌ల బారిన పడకుండా రక్షిస్తుంది. మీ కాంటాక్ట్స్‌లోని వ్యక్తి ఎవరైనా మిమ్మల్ని తమ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయగానే.. ఈ ఫీచర్ ఆటోమెటిక్‌గా ఎనేబుల్ అవుతుంది.
వెంటనే ఆ గ్రూప్ గురించిన పూర్తి వివరాలు మీకు సెండ్ చేస్తుంది. అందులో గ్రూప్ ఎప్పుడు క్రియేట్ చేశారు? ఎవరు చేశారు? మిమ్మల్ని అందులో యాడ్ చేసినవాళ్లు ఎవరు? ఎంతమంది ఉన్నారు? వంటివి చూపిస్తుంది. ఆ వివరాలన్నీ చూసి ఆ గ్రూప్‌లో ఉండాలో? ఎగ్జిట్ కావాలో? నిర్ణయించుకోవచ్చు. వద్దనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. అసలు ఆ గ్రూప్ వివరాలు కూడా తెలియాల్సిన అవసరం లేదు అనుకుంటే వెంటనే ఎగ్జిట్ అవ్వొచ్చు. అదే గ్రూప్‌లో కొనసాగాలంటే మాత్రం చెక్‌మార్క్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. చెక్ మార్క్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా రిజెక్ట్ చేస్తారా? అనేది కన్ఫర్మ్ చేసేవరకు నోటిఫికేషన్లు రాకుండా మ్యూట్‌లో ఉంటాయి.