
- విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ కు తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
సీఎంను ఏకవచనంతో మాట్లాడితే తానేదో గొప్పోడిని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారని, ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా అధికారంలోనే ఉన్నామనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ పాలనపై ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో జీర్ణించుకోలేని కేటీఆర్ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని కేటీఆర్ అనడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలని, గత పదేండ్లలో బీజేపీపై బీఆర్ఎస్ నేతలు ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.