
- దయ్యాలెవరు, కోవర్టులెవరంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ
- కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరిగిందా అనే అనుమానాలు
- ఇంటి నుంచే కవిత రాజకీయ సమావేశాలు
- కొత్త పార్టీ పెడతారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ
హైదరాబాద్, వెలుగు: తన తండ్రి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారి వల్లే పార్టీకి నష్టమని కవిత అంటుంటే.. ఆమెకు కౌంటర్ అన్నట్లుగా తమ పార్టీలో కోవర్టులు ఉన్నారని కేటీఆర్ అనడం బీఆర్ఎస్లో తీవ్ర చర్చకు దారితీసింది. అటు చెల్లె కామెంట్లు, ఇటు అన్న కామెంట్లతో.. అసలు పార్టీలోని దయ్యాలెవరు? కోవర్టులెవరని గులాబీ నేతలు ఆరా తీస్తున్నారు. కొన్నాళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కవిత అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. సొంత అజెండా సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. లిక్కర్ స్కామ్‌లో జైలుకెళ్లొచ్చిన తర్వాత.. ఆమెకు , కేటీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. అప్పట్లో ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ, ఇప్పుడు కవిత లేఖ, వ్యాఖ్యలు, అందుకు కౌంటర్‌గా అన్నట్లు కేటీఆర్ కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
ఇంటినే రాజకీయ వేదికగా మార్చి..!
జైలు నుంచి వచ్చాక కవిత తన ఇంటినే రాజకీయ వేదికగా మార్చారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై స్పందించారు. రిజర్వేషన్లపై ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ స్టాండ్ ఏదైనా ఆమె మాత్రం బీసీలకు రిజర్వేషన్లపై తన గళాన్ని వినిపించారు. పార్టీతో సంబంధంలేకుండా పార్టీకి సమాంతరంగా ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భం దొరికినప్పుడల్లా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. పార్టీలో ఆమెకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్లే సొంతంగా కార్యక్రమాలు చేపట్టారన్న అభిప్రాయాలూ బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కవిత బీఆర్ఎస్ నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ గతంలో జోరుగా ఊహాగానాలు వినిపించాయి. తాజా పరిణామాలు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. శుక్రవారం అమెరికా నుంచి కవిత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే.. జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ‘‘సామాజిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి.. కాబోయే సీఎం కవితక్క” అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ప్రస్తావనే లేదు. అయితే.. తన రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను ఇప్పటికే కేసీఆర్ ప్రమోట్ చేస్తున్నారు. పైగా కేటీఆరే ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. వరుస పరిణామాల నేపథ్యంలో కవిత త్వరలోనే కొత్త పార్టీ పెడతారా? అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడ్తున్నాయి.
కవితపై చర్యలా? వేచిచూసే ధోరణా?
కవిత లేఖ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానం యోచిస్తున్నదన్న టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు సీనియర్లు చెప్తున్నారు. పార్టీ లైన్‌ను మీరి అనవసరమైన వ్యాఖ్యలు చేశారని, క్రమశిక్షణ చర్యలు తప్పకపోవచ్చని కొందరు అంటున్నారు. అదే సమయంలో ఆమెపై ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన కూడా హైకమాండ్‌కు ఉన్నట్లు మరికొందరు చెప్తున్నారు.
‘‘కవిత కేసీఆర్ కురాసిన లేఖలో గానీ, ఎయిర్‌పోర్ట్‌లో అన్న మాటల్లోగానీ ఎక్కడా పార్టీని, పార్టీ అధినేతను ధిక్కరించలేదు.. పైగా కేసీఆర్‌ను దేవుడు అంటూనే ఆయన చుట్టూ ఉన్న కొందరిని మాత్రమే కవిత తప్పుపట్టారు. దీనికే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు.. అదీగాక చర్యలు తీసుకుంటే ఆమె వేరుకుంపటి పెట్టే ప్రమాదమూ ఉంది. ఇది పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుంది. అందువల్ల కవిత విషయంలో హైకమాండ్ వేచి చూసే ధోరణి అవలంబిస్తుందని భావిస్తున్నా..’’ అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు తెలిపారు. ఏదిఏమైనా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి పీకల్లోతు కష్టాల్లో ఉన్న బీఆర్ఎస్పెద్దలకు కవిత అంశం కొత్త తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.