20 ఏళ్లకే తెల్ల జుట్టా.. యువతను పీడిస్తున్న కొత్త సమస్య.. అసలు కారణం ఇదే.. తగ్గించుకోవచ్చు..

 20 ఏళ్లకే తెల్ల జుట్టా.. యువతను పీడిస్తున్న కొత్త సమస్య.. అసలు కారణం ఇదే.. తగ్గించుకోవచ్చు..

ఒక్క తెల్ల వెంట్రుక కనిపిస్తేనే.. ఆమ్మో అనుకుంటాం... అలాంటిది వయస్సు మించకముందే వస్తే... ఇప్పుడు ఈ తెల్ల జుట్టు సమస్య కొందరిలోనో  లేక వయస్సు పెరిగిన వృద్ధుల్లోనే కాదు...  జస్ట్ 20 ఏళ్లకే తెల్ల జుట్టు రావడం(premature graying) చాలా మంది యువతను కావలవపెడుతుంది, భయపెడుతుంది. 

సాధారణంగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య ఇంత త్వరగా రావడం వెనుక మన లైఫ్ స్టయిల్, ఆహారం ఇంకా పర్యావరణ ప్రభావాలే  అసలు కారణాలు. ఇంతకుముందు  40 ఏళ్ళు దాటాకనో లేక పెళ్లి తరువాతనో ఈ సమస్య ఉండేది. కానీ ఈ మధ్య పెళ్లి ముందే  అదికూడా ఇప్పుడు కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులలో కూడా సర్వసాధారణం అయింది. అయితే సరైన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, జుట్టు సంరక్షణతో ఈ సమస్యను నివారించవచ్చు లేదా తెల్ల జుట్టు రాకుండా తగ్గించవచ్చు.

తెల్ల జుట్టు రావడానికి  కారణాలు: సాధారణంగా 40-50 ఏళ్ల వయసు వచ్చాక జుట్టు తెల్లబడటం స్టార్ట్ అవుతుంది. కానీ ప్రస్తుతం యువతలో ఈ సమస్య పెరగడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి.
*జన్యు కారకాలు: మీ పూర్వీకులకు, తల్లిదండ్రులకు లేదా తాతాలకు త్వరగా జుట్టు తెల్లబడి ఉంటే, మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాలుష్యం, ఒత్తిడి: సిటీలో కాలుష్యం, హానికరమైన టాక్సిన్స్ జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి. అలాగే చదువు, ఉద్యోగం, పని ఒత్తిడి కారణంగా పెరిగే కార్టిసాల్ అనే హార్మోన్ జుట్టు రంగును ఇచ్చే మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. కాలుష్యం, సూర్యరశ్మి వంటివి కలిగించే ఆక్సీకరణ ఒత్తిడి (oxidative stress) కూడా మెలనిన్ కణాలను దెబ్బతీస్తుంది.

పోషకాహార లోపం: మన శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా జుట్టుకు రంగు ఇచ్చే మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక విధంగా బి విటమిన్లు (ముఖ్యంగా B12, B5), ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ ఇంకా రాగి వంటివి తక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. నేటి యువత ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం కూడా దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, తెల్లబడటాన్ని ఆపడానికి సరైన ఆహారం, జుట్టు సంరక్షణ చాలా అవసరం.

పోషకాహారం అలవాట్లు:
రాగి: రాగి ఎక్కువగా ఉండే ఆహారాలు ( నట్స్, గింజలు, చిక్కుళ్ళు) తీసుకోవడం వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
విటమిన్ B12 & B5: పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం వంటివి విటమిన్ B12కు మంచి వనరులు. బి5 విటమిన్ కోసం అవకాడో, బ్రోకలీ వంటివి తీసుకోవచ్చు.
ఐరన్, జింక్: ఆకుకూరలు, బీన్స్, చిక్కుళ్ళు, గింజలు తినడం వల్ల ఈ పోషకాలు లభిస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు: జుట్టు ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడటానికి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి.

సహజమైన  జుట్టు సంరక్షణ:
కెమికల్స్ తగ్గించండి: షాంపూలు, హెయిర్ డైలలో ఉండే సల్ఫేట్లు, పారాబెన్లు వంటి రసాయనాలు జుట్టును దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా సహజమైన, సల్ఫేట్ లేని ఉత్పత్తులను వాడితే మంచిది.

హీట్ స్టైలింగ్ తగ్గించండి: హెయిర్ స్ట్రెయిట్నర్లు, కర్లింగ్ ఐరన్‌ల వాడకం జుట్టును పల్చగా మార్చి, రంగును కోల్పోయేల చేస్తాయి. వీటి వాడకం తగ్గించడం మంచిది.

సహజమైన నూనెలు: ఆర్గాన్ ఆయిల్లో ఉండే విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు జుట్టును రక్షిస్తాయి. ఉసిరి (ఆమ్లా), భృంగరాజ్, మందారం వంటివి జుట్టుకు చాలా మంచివి. ఉసిరిలో ఉండే విటమిన్ C మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ఒత్తిడి నివారణ: యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

తెల్ల జుట్టు అనేది నివారించేలేనిది కాదు. కానీ సరైన ఆహారం, ఒత్తిడి లేని జీవితం, సహజమైన జుట్టు సంరక్షణతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు లేదా నివారించవచ్చు. మీకు 20 ఏళ్లలోనే తెల్ల జుట్టు రావడం మొదలైతే, వెంటనే ఇవి పాటించడం ద్వారా  తెల్ల జుట్టు సమస్య నుండి కొంతవరకు బయటపడొచ్చు.