SA vs ZIM: ప్రమాదంలో లారా 400 రికార్డ్: ట్రిపుల్ సెంచరీతో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర

SA vs ZIM: ప్రమాదంలో లారా 400 రికార్డ్: ట్రిపుల్ సెంచరీతో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ సరికొత్త చరిత్ర

సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్, ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బులవాయో వేదికగా  క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో టెస్టులో తొలిసారి 300 పరుగులు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ మార్క్ అందుకున్న ఈ సఫారీ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా  రికార్డులకెక్కాడు. ముల్డర్ ఇన్నింగ్స్ లో 38 ఫోర్లు, 3 సిక్సలు ఉన్నాయి.

ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా ముల్డర్ తన బ్యాటింగ్ లో మరింత వేగం పెంచాడు. ప్రస్తుతం 315 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇదే ఊపు కొనసాగిస్తే లారా 400 అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్ బద్దలయ్యే అవకాశం కనిపిస్తుంది. తొలి రోజు 264 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగించిన ముల్డర్.. రెండో రోజు దూకుడుగా ఆడి తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీమిండియా బ్యాటర్ సెహ్వాగ్ తర్వాత సెకండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ముల్డర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

ALSO READ : మా అక్క క్యాన్సర్‌తో పోరాడుతోంది.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: ఆకాష్ దీప్ ఎమోషనల్

2008లో సౌతాఫ్రికాపై చెన్నై టెస్టులో సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించగా.. 297 బంతుల్లో ముల్డర్ 300 మార్క్ అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. సౌతాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్ గా నిలిచాడు. మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 277 పరుగులను ,ముల్డర్ దాటేశాడు. తొలి ఇన్నింగ్స్ ముగిసేలోపు ఈ సఫారీ కొత్త ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి.  ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 549 పరుగులు చేసింది. క్రీజ్ లో ముల్డర్ (315), కైల్ వెర్రెయిన్ (17) ఉన్నారు.