IND VS ENG 2025: మా అక్క క్యాన్సర్‌తో పోరాడుతోంది.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: ఆకాష్ దీప్ ఎమోషనల్

IND VS ENG 2025: మా అక్క క్యాన్సర్‌తో పోరాడుతోంది.. ఈ ప్రదర్శన ఆమెకే అంకితం: ఆకాష్ దీప్ ఎమోషనల్

బర్మింగ్ హోమ్ టెస్ట్ తర్వాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఒక్కసారిగా సంచలనంగా మారాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించడంలో ఈ బెంగాల్ పేసర్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తన ఫాస్ట్ బౌలింగ్ తో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ గడ్డపై 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‎గా రికార్డ్ నెలకొల్పాడు. అంతకముందు ఈ రికార్డ్ చేతన్ శర్మ పేరిట ఉండేది.

1982లో బర్మింగ్ హామ్‎లో జరిగిన టెస్టులోనే రెండు ఇన్సింగ్సుల్లో కలిపి చేతన్ శర్మ 10 వికెట్లు తీశాడు. తాజాగా బర్మింగ్‎హామ్ వేదికగా జరిగిన టెస్టులోనే 10 వికెట్లు పడగొట్టి 29 ఏళ్ల తర్వాత చేతన్ శర్మ రికార్డును సమం చేశాడు ఆకాష్ దీప్. ఈ మ్యాచ్ తర్వాత ఆకాష్ ఒక ఎమోషనల్ స్టోరీని పంచుకున్నాడు. తన అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతోందని, తన మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను  ఆమెకు అంకితం చేస్తున్నానని ఈ ఫాస్ట్ బౌలర్ తెలిపాడు. 

ఆకాష్ దీప్ మాట్లాడుతూ.. "నేను ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. మా అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆమె బాగానే ఉంది. ఆమె నా ప్రదర్శన చూసిన తర్వాత ఎక్కువ సంతోషంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ మ్యాచ్‌ను ఆమెకు అంకితం చేయాలనుకుంటున్నాను. ఆమె ముఖంలో చిరునవ్వు చూడాలని నేను కోరుకున్నాను" అని మ్యాచ్ తర్వాత ఆకాష్ చెప్పుకొచ్చాడు. 

2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చివరి మూడు టెస్టుల్లో ఆకాష్ దీప్ తొలి సారి భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ ఖాన్ స్థానంలో ఆకాష్ దీప్ కు చోటు దక్కింది. ఆకాష్ దీప్ అంతకముందు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 7 మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. 

►ALSO READ | MS Dhoni birthday: టీమిండియాలో చెరగని ముద్ర.. నేటితో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ధోనీ

ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ అత్యద్భుత బ్యాటింగ్‌‌కు తోడు ఆకాశ్ దీప్ (10/187) రెండు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి పది వికెట్లతో కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో విజృంభించడంతో ఐదో రోజు, ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 336 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌పై అఖండ విజయం అందుకుంది. ఇండియా ఇచ్చిన 608 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌లో ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 72/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ 68.1  ఓవర్లలో 271 కే కుప్పకూలి చిత్తుగా ఓడింది.  దాంతో ఇండియా ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగులు చేస్తే.. బదులుగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి టీమిండియా  427 వద్ద డిక్లేర్ చేసింది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది.