MS Dhoni birthday: టీమిండియాలో చెరగని ముద్ర.. నేటితో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ధోనీ

MS Dhoni birthday: టీమిండియాలో చెరగని ముద్ర.. నేటితో 44 ఏళ్ళు పూర్తి చేసుకున్న ధోనీ

టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోనీ సోమవారం (జూలై 7) 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 16 ఏళ్ల జర్నీలో మిస్టర్ కూల్.. భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించి, అభిమానుల మదిలోనూ చిరస్థాయిగా నిలిచాడు. ధోనీ పుట్టిన రోజు   సందర్భంగా ప్రముఖ క్రికెటర్లు, సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెప్పారు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఇండియన్​ క్రికెట్​ హిస్టరీని తిరగరాసిన మహీకి సహచర క్రికెటర్లతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్​బర్త్​ డే విషెస్​ చెప్పారు.

కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కూల్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్న మహీ.. ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఎన్ని ఘనతలు సాధించినా ఓ కర్మయోగిలా తన పని చేసుకుంటూపోతాడు. అందుకే వరల్డ్​ క్రికెట్​లో ఓ ఐకాన్​గా నిలబడ్డాడు. 1981లో జూలై 7 న జన్మించిన ధోనీ గత ఏడాది తన 43వ పుట్టినరోజును ముంబైలో జరుపుకున్నాడు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకళకు హాజరైన మహేంద్రుడు.. ఇక్కడే కేక్ కట్ చేసి తన బర్త్ డే సెలెబ్రేషన్ చేసుకున్నాడు. ఈ వేడుకలో బాలీ వుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరవ్వడంతో ఈ పార్టీ ప్రత్యేకంగా నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.   

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ధోని తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడాడు. మొదటి మ్యాచ్ లో డకౌట్ అయినా ఆ తర్వాత జట్టులో కీలకమైన ఆటగాడిగా, తిరుగులేని ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2007లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకొని జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. కెప్టెన్‌గా భారత్‌కు 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ అందించాడు. వరల్డ్  క్రికెట్ లో 3 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని నిలిచాడు.  3 ఐసీసీ ట్రోఫీలతోపాటు ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌, 2 ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20 ట్రోఫీలు, టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లో నెంబర్‌ వన్‌ పొజిషన్‌‌కు టీమిండియాను చేర్చిన ఘనత ధోని సొంతం చేసుకున్నాడు.

2019 వన్డే ప్రపంచకప్ తరువాత ధోని సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అతని వీడ్కోలు చెప్పిన అరగంటకే సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 350 వన్డేలు ఆడిన ధోని 10,773 పరుగులు చేశాడు. 98 టీ20లు ఆడి 1,617 పరుగులు తీశాడు. 90 టెస్టులు ఆడి 4,876 రన్స్ సాధించాడు.