ఆ డబ్బుతో.. వందేండ్లు గ్యాస్​ ఫ్రీగా ఇయ్యొచ్చు

ఆ డబ్బుతో.. వందేండ్లు గ్యాస్​ ఫ్రీగా ఇయ్యొచ్చు
  • సర్కారు భూములమ్మి జేబులు నింపుకుంటున్నరు: విజయశాంతి

కమలాపూర్​, వెలుగు: గ్యాస్​ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందంటూ టీఆర్​ఎస్​ నేతలు ప్రచారం చేస్తున్నారని, కానీ, ఈ ఏడేండ్లలో సీఎం కేసీఆర్​ లక్ష కోట్లు దోచుకున్నాడని, ఆ డబ్బును బయటకు తీస్తే వందేండ్లు గ్యాస్​ను జనానికి ఫ్రీగా ఇవ్వొచ్చని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. హుజూరాబాద్​ నియోజకవర్గంలోని కమలాపూర్​లో బుధవారం ఆమె ప్రచారం చేశారు. ఈటల గెలిస్తే ఏమొస్తుందంటూ టీఆర్​ఎస్​ వాళ్లు అడుగుతున్నారని, ఆయన గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం బతుకుతుందని అన్నారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా తనతో  చెప్పాలని సీఎం కేసీఆర్​ అంటున్నారు. కానీ, ఆయనే పెద్ద అవినీతిపరుడు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటూనే దుబాయ్​లో కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నారు. సర్కారు భూములను అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు’’ అని ఆరోపించారు. గిరిజనులు పోడు భూముల కోసం పోరాడుతున్నా ఇప్పటిదాకా హక్కు పత్రాలు ఇచ్చింది లేదని విమర్శించారు. దళితబంధును పెట్టినట్టే పెట్టి మధ్యలోనే ఆపేశారని ఆరోపించారు. ఉద్యమకారులను, పార్టీ కోసం కష్టపడిన వాళ్లను బయటకు పంపించారని విజయశాంతి మండిపడ్డారు.